అక్షరటుడే, వెబ్డెస్క్ : Nellore | పేకాటకు అలవాటు పడిన వారు పోలీసులకు చిక్కకుండా అనేక ప్లాన్లు వేస్తారు. రహస్యా ప్రాంతాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది పేకాడుతుంటారు. అయితే పోలీసుల దాడుల నుంచి తప్పించుకోవడానికి వీరు రకరకాల తిప్పలు పడుతారు. అటవీ ప్రాంతాలు, పడుబడ్డ ఇళ్లలో సైతం పేకాట ఆడుతారు. అంతేగాకుండా కొంతమంది ప్రత్యేకంగా పేకాట స్థావరాలను నిర్వహించి డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే తాజాగా కొందరు యువకులు పేకాడటానికి వెళ్లి నదిలో చిక్కుకుపోయారు.
Nellore | వరద చుట్టుముట్టడంతో..
నెల్లూర్లోని భగత్ సింగ్ కాలనీ సమీపంలో పెన్నా నది (Penna River)లో 17 మంది యువకులు పేకాడటానికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి యువకులు నది మధ్యలోకి వెళ్లి పత్తాలు ఆడుతుండగా.. అనుకొని ప్రమాదం ఎదురైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమశిల రిజర్వాయర్ (Somashila Reservoir)కు భారీగా వరద వచ్చింది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పెన్నా నదిలోకి భారీగా వరద వచ్చింది. ఆ సమయంలో పేకాడుతున్న యువకులను వరద చుట్టు ముట్టింది. పోలీసులకు చిక్కకుండా నదిలోకి వెళ్లిన యువకులు వరదలో చిక్కుకోవడంతో ఆందోళన చెందారు. తమను కాపాడాలని కేకలు వేశారు.
Nellore | కాపాడిన ఫైర్ సిబ్బంది
వరద నీరు చుట్టు ముట్టడంతో యువకులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక బంధువులకు ఫోన్ చేశారు. వారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్ని మాపక, నీటి పారుదల శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం తాళ్ల సాయంతో నదిలో చిక్కుకున్న యువకులను కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.