అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) తెలిపారు.
సీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇందల్వాయి (Indalwai) వద్ద శనివారం సాయంత్రం అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకొని 40 కిలోల ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ముఠా గత ఏడాది కాలంగా జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్ టౌన్ (Bodhan Town), బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించిందని వివరించారు. వీరు జిల్లాలో మొత్తం 101 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారన్నారు. కాగా.. మొత్తం 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (Nizamabad ACP Raja Venkat Reddy) ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి శనివారం నిందుతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఠాలోని ఐదుగురు సభ్యులతో పాటు వీరి వద్ద కాపర్ కాయిల్స్ (copper coils) కొనుగోలు చేసిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.
నిందితుల నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్, రూ. 5.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. రెండు స్కూటీలు, ఆరు సెల్ ఫోన్లు (scooties and six cell phones) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సైలు సందీప్, షరీఫ్, మహేష్, సిబ్బంది, కిరణ్ గౌడ్, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్లను సీపీ సాయి చైతన్య అభినందించారు.
Nizamabad CP | నిందితులు వీరే..
మహారాష్ట్ర (Maharashtra) పోచేదాం తాలూక దేశ్ముఖకు చెందిన తుంబారె సుధాకర్ (45), ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమీనా నగర్‌కు చెందిన హర్బీర్ శర్మ (50), గుంటూరు జిల్లా సుప్రియ టవర్స్‌కు చెందిన అలీ మహమ్మద్ (41), ప్రకాశం జిల్లా బండివెల్లి పల్లికి చెందిన యడాల వెంకటేశ్వర్లు (24), మహబూబ్ నగర్ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన శానపల్లి రవీందర్ @ మాదవ రెడ్డి(42)ని అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. వీరు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. కాగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలీ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
Nizamabad CP | కొనుగోలు చేసి అరెస్టయిన వారు వీరే..
అంతర్రాష్ట్ర ముఠా నుంచి కాయిల్స్ కొనుగోలు చేసిన వారిలో ముగ్గురు అరెస్టయ్యారు. వీరిలో యాదాద్రి జిల్లా సంకలపల్లికి చెందిన లింగప్ప (24), సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన గాజుల శ్రీ శైలం (60), హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్‌కు చెందిన మహమ్మద్ హైదర్ అలీ (24) ఉన్నారు.
