అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | దారి దోపిడీలు, గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ (kamareddy additional sp) నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఆరు నెలలుగా కామారెడ్డి(Kamareddy), నిర్మల్ (Nirmal), నిజామాబాద్ (Nizamabad) జిల్లాలతో పాటు జాతీయ రహదారులపై దారి దోపిడీలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని గాంధారి, పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోలిస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
నిందితులు రహదారులపై ఆగి ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకొని మారణాయుధాలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతుంటారని చెప్పారు. రహదారులకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడేవారన్నారు. వీరిని పట్టుకోవడం కోసం ఎల్లారెడ్డి డీఎస్పీ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం గాంధారి మండలం మొండి సడక్ చౌరస్తా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అరెస్టయిన వారిలో ఏ1 నాందేడ్ జిల్లా మంగ్యాల్ తండాకు చెందిన నాందేవ్ అలియాస్ రామకృష్ణ భోస్లే అలియాస్ రాందాస్ భోస్లే, ఏ3 బీదర్ జిల్లా ఖేర్దకు చెందిన కృష్ణబాబు షిండే అలియాస్ కృష్ణకుమార్ షిండే, ఏ4 నాందేడ్ జిల్లా వాసుర్కు చెందిన రాథోడ్ అజిత్ రమేష్, ఏ5 నాందేడ్ జిల్లా ఛందోళ తండాకు చెందిన గజానంద్ రామరావు ఉన్నారని అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఏ2 భాస్కర్ చౌహాన్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.