అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | తాళాలు వేసిన ఇళ్లు, షట్టర్లను టార్గెట్ చేస్తూ చోరీ పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
గతనెల 2వ తేదీన అశోక్ నగర్ కాలనీలో జరిగిన చోరీకి సంబంధించి బాధితుడు మాలోత్ బాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా (Nellore district) వేదాయ పాలెంకు చెందిన చిల్లకూరి కృష్ణారెడ్డి అలియాస్ చండి కృష్ణను పోలీసులు గతనెల 9న అరెస్ట్ చేశారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన మూడవత్ అంజియా, యప్రల్కు చెందిన సత్యనారాయణ (దొంగసొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి)లను సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
Kamareddy SP | తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో..
వీరిద్దరూ కృష్ణారెడ్డి, గొడుగు ప్రభాకర్ లతో కలిసి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. చోరీల (thefts) కోసం బైకును చోరీచేసి నంబర్ ప్లేట్ మార్చి వినియోగిస్తున్న విషయంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను ముతూట్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు సెల్ఫోన్లను అమ్మడం, సత్యనారాయణ అనే వ్యక్తి ద్వారా ఇతరులకు అమ్మించి వచ్చిన డబ్బును జల్సాలు, మద్యం, పేకాటకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి మొబైల్, ఒక వెండి మొలతాడు, ఒక వెండి ఉంగరం, ఒక వెండి గొలుసు, 89 గ్రాములు గల 9 వెండి ముద్దలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.
Kamareddy SP | లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి పట్టణంలోని ఓ వృద్ధురాలిని లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ చేసిన కేసులో దుండగుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. భరత్ రోడ్డులో నివాసం ఉంటున్న బట్టు నర్సవ్వ కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. భుపుత్రమ్మ కల్యాణ మండపం వద్ద ఆమెతో మాట కలిపిన గాంధారి మండలం నడిమి తండాకు చెందిన రాత్ల రవి గత నెల 30న ఇంటివద్ద దింపుతానని బైకుపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక వృద్ధురాలికి కల్లు తాగించి మత్తులోకి జారుకోగానే మెడలో ఉన్న తులం బంగారు గుండ్లను బలవంతంగా లాక్కుని పరారయ్యాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సొత్తును అమ్మడానికి వెళ్లిన రవిని సుభాష్ రోడ్డులో పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి లిఫ్ట్ కోసం వాహనం ఎక్కవద్దని ఎస్పీ సూచించారు.