అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | బాగ్ అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద ఘటన అందరినీ కలిచివేసింది. పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack)కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
రాంనగర్‌కు (Ramnagar) చెందిన శ్రీనివాస్, స్వాతి దంపతుల కుమారుడు కె.వి.ఎస్. ప్రణవ్‌రాయ్ సాయి (17) అదే కళాశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం స్లిప్ టెస్ట్ కోసం తండ్రి అతడిని కాలేజీ వద్ద దింపి వెళ్లాడు. పరీక్ష హాల్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే ప్రణవ్‌రాయ్ సాయికి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత కలగడంతో అక్కడికక్కడే కూలిపోయాడు.
Hyderabad | తీవ్ర విషాదం..
పరిస్థితిని గమనించిన సహ విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి (Private Hospital) తరలించినా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు మృతికి కారణమని తెలిపారు. ప్రణవ్‌రాయ్ సాయికి చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఇటీవల అతడు సాధారణంగానే ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కళాశాల యాజమాన్యం (College Management) పరీక్షలు నిర్వహించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, పరీక్ష రాయాల్సిన హాల్ కింద అంతస్తులో ఉన్నప్పటికీ పైఅంతస్తులో ఉందని చెప్పి పైకి, మళ్లీ కిందకు పంపడం వల్లే ప్రణవ్‌రాయ్ సాయి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని వారు పేర్కొన్నారు.
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు (Student Union Leaders) కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. మరోవైపు.. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కళాశాల విద్యార్థులు, స్నేహితులు, బంధువులు ప్రణవ్‌రాయ్ సాయి నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. కుమారుడిని కోల్పోయిన శ్రీనివాస్, స్వాతి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు, విద్యార్థులు కోరుతున్నారు.