అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
గతనెల 31న చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో పాత జాతీయ రహదారి (national highway) పక్కన ఉన్న ఆటో ఎలక్ట్రికల్ రేకుల షెడ్డులోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి షెడ్డులో ఉన్న కారు, ఇతర వస్తువులు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అలాగే ఇటీవల కామారెడ్డి పట్టణ (Kamareddy town) పరిధిలో జరిగిన చోరీలపై నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరించారు. అయితే శనివారం నర్సన్నపల్లి కమాన్ వద్ద మరోసారి చోరీకి ప్లాన్ చేసి అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరిని విచారించగా దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్ (Sadashivanagar), భిక్కనూరు పరిధిలో చేసిన 15 చోరీలకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారు.
Kamareddy SP | నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ..
అలాగే నిజామాబాద్, నిర్మల్ (Nizamabad and Nirmal) జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్టు తేలింది. నిర్మల్, మహబూబాబాద్‌కు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. వివిధ జిల్లాల్లో సుమారుగా కిలోన్నర బంగారం, ఇతర ఆభరణాలు చోరీ చేసినట్టు ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా బాంని గ్రామానికి చెందిన షేక్ ట్రాఫిక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యూమ్, షేక్ అజ్జు, మహబూబాబాద్ పట్టణానికి చెందిన బండారి అశోక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం వీరిని కస్టడీకి తీసుకుని విచారించి చోరీ చేసిన సొత్తును రాబడతామన్నారు. ఇందులో అశోక్ పై 22 కేసులు, షేక్ అజ్జుపై 9, ఖాదర్‌పై 17, ఖయ్యుమ్పై 18, రఫీక్‌పై ఒక కేసు ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు మూడు బైకులు, మూడు ఇనుప రాడ్లు, ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ టైప్ వెపన్, డీజిల్ క్యాన్, ఒకటి వెహికిల్ డయాగ్నస్టిక్ స్కానర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు విచారణలో చురుగ్గా పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్, కామారెడ్డి రూరల్ సీఐలు శ్రీనివాస్, రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్ పాల్గొన్నారు.
