అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు కూతురు కళ్ల ముందే తండ్రి అల్లుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దర్భంగా మెడికల్ కాలేజీ(Darbhanga Medical College)లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్నూ ప్రియ, అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు(Castes Separate) కావడంతో పెద్దలు ఒప్పుకోరని భావించిన వీరు, కుటుంబ అనుమతి లేకుండానే కొద్ది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వారు తాము చదువుకుంటున్న కాలేజీ హాస్టళ్లలోనే ఉంటున్నారు.
Inter Caste Marriage | ఎంత దారుణం..
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ప్రియ తండ్రి ప్రేమ్ శంకర్ ఝా తీవ్ర కోపంతో రగిలిపోయాడు. తన కుటుంబ పరువు నాశనమైందని భావించి, తన వద్ద ఉన్న లైసెన్స్ గన్(Licensed Gun)తో కాలేజీకి వెళ్లి, తన కూతురు కళ్ల ముందే రాహుల్‌పై కాల్పులు జరిపాడు. ఛాతిలో బుల్లెట్ తగలడంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు ప్రియ తండ్రిని అడ్డుకున్నారు. రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే అతను చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రేమ్ శంకర్ ఝాను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై బాధిత యువతి ప్రియ స్పందిస్తూ, “నా తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడన్న విషయం నమ్మలేకపోతున్నాను. మా పెళ్లి సమయంలో మా కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని భావించి పోలీసులను ఆశ్రయించాం. అయినా కూడా రక్షణ లభించలేదు. ఇది కేవలం నా తండ్రి చేసిన పని కాదు, మా కుటుంబం మొత్తం కుట్రలో భాగమైంది” అని వాపోయింది.ఈ ఘటనపై కాలేజీ విద్యార్థులు(College Students) పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రియ తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్‌ను కాల్చిన అనంతరం కాలేజీ విద్యార్థులు ప్రేమ్ శంకర్‌పై దాడి చేశారు. గాయాల బారిన పడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ జగన్నాథ్ రెడ్డి(SP Jagannath Reddy) తెలిపారు.