అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Instagram Update | ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువత వినియోగిస్తున్న సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా సంస్థ (Meta Organization) కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమా పరిశ్రమలో అమలు అవుతున్న PG-13 రేటింగ్ మాదిరిగానే, ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) కూడా కంటెంట్ రేటింగ్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా 13 ఏళ్ల పైబడిన టీనేజ్ యూజర్లకు మాత్రమే తగిన కంటెంట్ చూపించే విధంగా ప్లాట్‌ఫారమ్ నియంత్రణలు అమలు కానున్నాయి. మెటా ప్రకారం, 18 ఏళ్ల లోపు ప్రతి యూజర్‌ను ఆటోమేటిక్‌గా 13+ కేటగిరీలో ఉంచుతారు. దీనర్థం, ఈ వయసు యూజర్లు చూసే కంటెంట్‌కు కఠినమైన ఫిల్టరింగ్ అమలవుతుంది.
Instagram Update | ఆటలకు చెక్..
డ్రగ్స్ వాడకం, హింసాత్మక వీడియోలు, అడల్ట్ లేదా అసభ్య కంటెంట్, అనారోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించే పోస్టులు టీనేజ్ యూజర్ల (Teenage Users) ఫీడ్‌లో కనిపించవు. ముఖ్యంగా, పేరెంట్స్ అనుమతి లేకుండా పిల్లలు ఈ సెట్టింగ్స్‌ను మార్చలేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా టీనేజర్ల మానసిక ఆరోగ్యంలో ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ ట్రెండ్స్, అనుచిత కంటెంట్, మానసిక ఒత్తిడి పెంచే పోస్టులు యువతలో సమస్యలుగా మారుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచి, మెటా తల్లిదండ్రుల పాత్రను బలపరిచి, పిల్లలకు అనుకూలమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కొత్త రేటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కంటెంట్ రేటింగ్ సిస్టమ్ (Rating System) సరైన విధంగా అమలైతే, టీనేజ్ యూజర్ల భద్రతను గణనీయంగా పెంచి, సోషల్ మీడియా వాడకాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చే అవకాశం ఉంది. టీనేజర్లను కొన్ని కంటెంట్ విషయాలలో సేవ్ చేయడానికి వయస్సు అంచనా వేసే సాంకేతికతను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. వారు పెద్దలమని చెప్పుకున్నప్పటికీ, ఈ సాంకేతికతతో చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.