అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Street Dogs | దేశవ్యాప్తంగా కుక్కల (Dogs) బెడదతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి కుక్కలు (Street Dogs) రోడ్లపై ఇష్టారీతిగా తిరుగుతున్నాయి. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనాలకు అడ్డువచ్చి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. గతంలో కుక్కల దాడుల్లో ఎంతోమంది చిన్నారులు చనిపోయారు. గ్రామాల నుంచి మొదలు పెడితే మహా నగరాల వరకు కుక్కల బెడద ఉంది. వీటి బెడద నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వీధి కుక్క పిల్లలను దత్తత ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీధి కుక్కపిల్లలకు ప్రేమ, ఇల్లు ఇవ్వాలని ప్రోత్సహించడానికి ఇండీ డాగ్ కుక్కపిల్ల దత్తత డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఆగస్టు 17న (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 10:00 గంటల వరకు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని జలగం వెంగళ్ రావు పార్క్‌లో నిర్వహించనున్నారు.
Street Dogs | ఆసక్తి గలవారు రావొచ్చు
పలువురు జంతు ప్రేమికులు (Pet Lovers) వీధి కుక్కలపై ప్రేమ కనబరుస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి అవకాశం. దేశీయ కుక్క పిల్లలను ఫ్రీగా దత్తత తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన, టీకాలు వేసిన, నులిపురుగులు తొలగించబడిన ఇండీ కుక్కపిల్లలను అధికారులు దత్తత ఇవ్వనున్నారు. ఇప్పటికే నగరంలో చాలా మంది వివిధ రకాల బ్రీడ్ కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు. అలాంటి జంతు ప్రేమికులు వీధి కుక్కపిల్లలను పెంచుకుంటే నగరంలో కుక్కల బెడద తగ్గడంతో పాటు వారికి తోడుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దేశీయ కుక్కలు ఉల్లాసభరితమైనవి, విశ్వాసపాత్రమైనవి, తక్కువ నిర్వహణతో జీవిస్తాయని పేర్కొన్నారు.
Street Dogs | కుక్కపిల్లలకు ప్రేమ అందుతుంది
ఆసక్తి గల ప్రజలు నిర్ణిత సమయానికి జలగం వెంగళ్రావు పార్క్ (Jalagam Vengal Rao Park)కు రావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంతో వీధి కుక్కల జనాభా తగ్గడంతో పాటు జంతువులకు సురక్షితమైన, ప్రేమగల వాతావరణాన్ని కూడా అందుతుంది. ఇటీవల ఢిల్లీలో వీధికుక్కలను తరలించాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించింది. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ నటి అయితే ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి నగరంలో నిర్వహించే దత్తత డ్రైవ్‌కు ఎంత మంది జంతు ప్రేమికులు వస్తారో చూడాల్సి ఉంది.