HomeతెలంగాణMinors Driving | మైనర్​ డ్రైవింగ్​పై వినూత్న ప్రచారం

Minors Driving | మైనర్​ డ్రైవింగ్​పై వినూత్న ప్రచారం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు :Minors Driving | బండికి కాళ్లు అందకపోయినా మైనర్లు రోడ్డుపైకి రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు. వచ్చీరాని డ్రైవింగ్‌తో రహదారులు ఎక్కేసి హల్‌చల్‌ చేస్తున్నారు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా.. బండిని కంట్రోల్‌ చేయడం తెలియకున్నా.. జామ్‌జామ్​ అంటూ తోలుతున్నారు. ఇలా మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నిజామాబాద్​ పోలీసులు నడుం బిగించారు. మైనర్​ డ్రైవింగ్​ చేసే వారిని పట్టుకుని వారితోనే వినూత్న ప్రచారం చేయిస్తున్నారు. మైనర్​ డ్రైవింగ్​తో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలంటూ మైనర్ల ద్వారా ప్లకార్డులతో అవగాహన పెంపొందిస్తున్నారు. పోలీస్​శాఖ చేస్తున్న ఈ వినూత్న ప్రచారంపై పలువురు హర్షం చేస్తున్నారు.

పిల్లలు మారం చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు(Parents) వారి చేతికి వాహనాలు ఇస్తున్నారు. మరి కొందరు స్టేటస్​ సింబల్​గా భావించి పిల్లలకు వాహనాలు కొనిస్తున్నారు. అయితే మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవింగ్​ చేసిన మైనర్​తో పాటు వాహన యజమానికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే నిజామాబాద్​ నగరంలో జరిమానాలతో పాటు మైనర్లతోనే వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Minors Driving | సీపీ స్పెషల్​ ఫోకస్​

నిజామాబాద్ పోలీస్ కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య(CP Sai Chaitanya) ట్రాఫిక్, వాహన తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు నెలలుగా ప్రత్యేక బృందాలతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు కారణం అవుతున్నారు. దీంతో సీపీ మైనర్ల డ్రైవింగ్(CP Minors Driving)​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.

Minors Driving | వారితోనే ప్రచారం

నిజామాబాద్(Nizamabad)​ నగరంలో వాహనం నడుపుతూ దొరికిన మైనర్లకు జరిమానాలు విధించడంతో పాటు వినూత్న అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో అత్యధికంగా మైనర్లు జిల్లా కేంద్రంలోనే పట్టుబడుతున్నారు. గత వారం రోజులుగా చేపట్టిన తనిఖీల్లో 36 మంది దొరకడం గమనార్హం. దీంతో జిల్లా పోలీసులు చిక్కిన మైనర్లతోనే ప్రచారం చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో, సిగ్నల్స్ వద్ద ప్లకార్డులు పట్టుకొని మైనర్​ డ్రైవింగ్​తో జరిగే అనర్థాలపై ప్రచారం చేయిస్తున్నారు.

Minors Driving | మైనర్లకు వాహనాలు ఇస్తే విధించే శిక్షలు

  • మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
  • వాహన యజమాని లేదా తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష.
  • నేరంలో ఉపయోగించిన వాహనం రిజిస్ట్రేషన్ (ఆర్సీ) 12 నెలల పాటు రద్దు.
  • ఒక్కోసారి నేరం తీవ్రత సందర్భాన్ని బట్టి మైనర్​కు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా నిషేధిస్తారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

‌‌– పబ్బ ప్రసాద్​, ట్రాఫిక్ సీఐ

మైనర్లు వాహనం నడపడం నేరం. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ వాహనం నడుపుతూ దొరికితే భారీ జరిమానాలు విధిస్తాం. వాహన యజమానికి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అవగాహన రాహిత్యంతో వాహనాలు నడిపే మైనర్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలి.