అక్షరటుడే, వెబ్‌డెస్క్: MadhyaPradesh | పుణ్యం చేయబోతే పాపం చుట్టుకుందంటారు.. అచ్చం అలాగే అయింది ఆ అభాగ్యుడి పరిస్థితి. పోలీసులు అహంకారానికి పోతే.. పగబట్టి, ఎంత నీచంగా ప్రవర్తిస్తారో ఈ ఘటన అద్దం పడుతోంది. ఆపదలో ఉన్న మహిళకు సాయం చేయడమే పాపమైనట్లు పోలీసులు ఓ అభాగ్యుడి బతుకును పూర్తిగా నాశనం చేశారు.
క్రిమినల్స్ తో కఠినంగా వ్యవహరిస్తూ.. సామాన్యులను కూడా నేరస్తులుగా పరిగణిస్తున్న పోలీసులు ఎంతలా మానవత్వం మరచిపోతున్నారనేది మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో వెలుగుచూసిన ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సాయం చేసిన వ్యక్తిని అభినందించాల్సింది పోయి, ఏకంగా 13 నెలల పాటు జైలులో పెట్టి, తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు.
అధికారం తమ చేతుల్లో ఉందనే అహంకారంతో అమాయకుడి జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. జైలు జీవితం అనంతరం అతడు బయటకు వచ్చాక పని చేసుకుని బతికే అవకాశం కూడా లేకుండా చేశారు ఆ కరుడు గట్టిన పోలీసు బాబులు.
MadhyaPradesh | అసలేం జరిగిందంటే..
బోపాల్(Bhopal)లోని ఆదర్శనగర్‌కు చెందిన రాజేశ్ విశ్వకర్మ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా మురికివాడలో ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుని దొరికిన పని చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవితం వెల్లదీస్తున్నాడు.
కాగా, రాజేశ్ పొరిగింటి మహిళకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విచారణకు సహకరించలేదని రాజేశ్‌ను అరెస్టు చేసి, జైలుకు పంపారు.
MadhyaPradesh | కుటుంబానికి చెప్పని పోలీసులు
హత్యానేరం(murder case) కింద రాజేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడి కుటుంబానికి 9 రోజుల వరకు సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే రాజేశ్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. నిరుపేద కావడంతో రాజేశ్ అడ్వకేట్‌ను హైర్ చేసుకోలేకపోయాడు.
దీంతో రాజేశ్ తరఫున వాదించేందుకు కోర్టు ఒక ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించింది. ఇక అడ్వకేట్ విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగుచూశాయి. మరణించిన మహిళ మెడికల్ రిపోర్టులో ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఉంది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం గొంతుకోసి చంపినట్లు ఉండటాన్ని గుర్తించిన న్యాయవాది.. రెండింటిని కూడా కోర్టు ముందుంచారు.
లోతుగా విచారిస్తే.. పోలీసుల బండారం బయటపడింది. పోలీసులు, పోస్టుమార్టం(postmortem) సిబ్బంది కలిసి కావాలనే అమాయకుడిని కేసులో ఇరికించినట్లు గుర్తించిన కోర్టు.. రాజేశ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
MadhyaPradesh | బతుకు దుర్భరం..
జైలు నుంచి బయటకు వచ్చాక రాజేశ్ బతుకు మరింత దుర్భరంగా మారింది. 13 నెలల క్రితం తన అద్దె గదికి పోలీసులు తాళం వేయడంతో.. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న అద్దెను ఇప్పుడు రాజేశ్ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
దీనికితోడు మరో దుర్భర పరిస్థితి ఏమిటంటే.. జైలుకు వెళ్లొచ్చాడని రాజేశ్‌కు ఎవరూ పని ఇవ్వడం లేదు. ఇలా.. పోలీసుల వంచనకు గురై ఏ పని చేయాలో తెలియక, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం అవ్వక ప్రస్తుతం రాజేశ్ అల్లాడుతున్నాడు.