అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. గత పది రోజులుగా జలాశయంలో భారీగా ఇన్‌ఫ్లో వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా, ఎగువన వర్షాలు లేకపోవడంతో గోదావరి (Godavari)కి వరద రావడం లేదు. దీంతో జలాశయంలోకి ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో అధికారులు వరద గేట్లను మూసివేశారు.
ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం ఎగువ నుంచి 26,677 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు (1091 అడుగులు) కాగా ప్రస్తుతం 80.053టీఎంసీల (1090.90 అడుగులు) నీరు నిల్వ ఉంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం నాలుగు గేట్ల ద్వారా గోదావరిలోకి అధికారులు నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో తగ్గడంతో అన్ని గేట్లను మూసి వేశారు.
Sriram Sagar | కాలువల ద్వారా..
వరద గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపి వేసిన అధికారులు కాలువ ద్వారా మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా వెయ్యి క్యూసెక్కులు, కాకతీయ కాలువ (Kakatiya) కు 3,500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలిసాగర్ (Ali Sagar) ఎత్తిపోతలకు 360 క్యూసెక్యులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా.. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది.
Sriram Sagar | మిడ్ మానేరుకు..
ఎస్సారెస్పీ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్మించిన వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను మిడ్ మానేరకు తరలిస్తున్నారు. దీంతో మిడ్ మానేరు (Mid Manair) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి మొత్తం 26,677 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఎగువ నుంచి వరద పెరిగితే మళ్లీ శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. నదిలోకి చేపల వేటకు వెళ్లొదన్నారు. అలాగే కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రజలు అటువైపు వెళ్లొద్దని కోరారు.