అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Cabinet Expansion | కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు మరోసారి మెండి”చేయి” చూపింది. మంత్రివర్గ విస్తరణ (Cabinet Expension) సందర్భంగా తమకు చాన్స్ వస్తుందని భావించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు పరాభవమే మిగిలింది. దీంతో మరోసారి కేబినెట్‌లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి జిల్లాల్లో (Kamareddy District) కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వారిలో బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి (Sudharshan Reddy) ఈసారి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. దీంతో ఈసారి మంత్రిమండలిలో జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయనకు చోటు దక్కలేదు. సామాజిక సమీకరణలకే పెద్దపీట వేసిన కాంగ్రెస్.. ప్రాంతీయతను పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లా (Jiont Districts) నుంచి కేబినెట్‌లో ప్రాతిధ్యం లేకుండా పోయింది.
Telangana Cabinet Expansion | నిజామాబాద్‌కు దక్కని ప్రాతినిధ్యం..
దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నేతలకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కేది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇందూరు నేతలు ఎవరో ఒకరికి మంత్రిగా అవకాశం లభించేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది. కాంగ్రెస్ (Congress) పాలనలో అర్గుల్ రాజారాం, సుదర్శన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, షబ్బీర్ అలీ వంటి ఉద్దండులు మంత్రులుగా పని చేశారు. టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు ఏలేటి మహిపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి వంటి వారు మంత్రులు అయ్యారు. ఇక, తెలుగుదేశంతో పాటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి పలుమార్లు అమాత్యుడిగా కొనసాగారు. బీఆర్ఎస్ (BRS) రెండోసారి అధికారంలోకి వచ్చాక వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్‌లో చాన్స్ దక్కింది. కానీ ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పడ్డాక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇందూరుకు మెండి’చేయి’ చూపింది. 2023 నవంబర్‌లో ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి (MLA Sudharshan Reddy) మంత్రి పదవి ఖాయమన్న వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆదివారం జరిగిన విస్తరణలోనూ ఇందూరు నుంచి సుదర్శన్‌రెడ్డికి అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ మళ్లీ రిక్త “హస్తమే” చూపింది.
Telangana Cabinet Expansion | నిరాశలో కాంగ్రెస్ నేతలు..
మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యేలు నారాజ్ అయ్యారు. కేబినెట్ మార్పుచేర్పుల్లో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కూ (MLA Madan Mohan) అవకాశం లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఇద్దరికీ నిరాశే మిగిలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Joint Nizamabad District) కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బోధన్, ఎల్లారెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్‌లో భూపతిరెడ్డి, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నలుగురిలో ఒకరికి బెర్త్ ఖరారవుతుందని భావించారు. ప్రధానంగా సుదర్శ్‌రెడ్డి పేరు ఖాయమైందన్న ప్రచారం జరిగింది. కానీ, పెద్దాయనకు మరోమారు భంగపాటు ఎదురైంది. కాంగ్రెస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ పేరు కూడా వార్తల్లోకి వచ్చినప్పటికీ, ఆయనకు నిరాశే తప్పలేదు. కనీసం మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకైనా ఛాన్స్ లభిస్తుందనుకుంటే అది కూడా జరుగలేదు. ఫలితంగా మంత్రిమండలిలో ఈసారి కూడా ఇందూరు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకుండా పోయింది.