అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house)పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందజేస్తామన్నారు.
సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పొన్నం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల (Double bedroom houses)పై బుధవారం సమీక్ష నిర్వహించారు. పేదలకు ఇళ్లు అందించడంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Indiramma Housing Scheme | ప్రభుత్వ స్థలంలో..
నగరంలో ఎల్ వన్ (L1) కింద 4,800 మంది ఇళ్ల స్థలాలు ఉన్న అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే ఎల్ టు (L2) కింద హైదరాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సొంత స్థలాలు లేని వీరికి నగరంలో స్థలం సేకరించి జీ ప్లస్ 5 నుంచి జీ ప్లస్ 10 వరకు భవనాలు నిర్మించి ఇళ్లు అందిస్తామని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ హరిచందన దాసరి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.