అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Illu | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రంలో (Balasamudram) శుక్రవారం ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (Double Bedroom Houses) పంపిణీ చేశారు. మొత్తం 592 మందికి ఇళ్ల పత్రాలను మంత్రి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు.
Indiramma Illu | 4.5 లక్షల మందికి..
పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు ఇల్లు ఇవ్వాలని అధికారులకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పేదల ముఖంలో నవ్వు చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేశారు.
సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకుంటున్న వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల సాయం చేయనుంది. ఇప్పటికే పనులు మొదలు పెట్టిన వారికి డబ్బులు కూడా జమ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఇల్లు రాని వారికి రెండో విడతలో ఇస్తామని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, ఆందోళన చెందొద్దని చెప్పారు.
Indiramma Illu | 6.5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు
బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం కొత్తగా 6.5 లక్షల కార్డులను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డుల్లో భార్య, పిల్లలను చేర్చడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
Indiramma Illu | కమీషన్ల కోసమే కాళేశ్వరం
బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందని మంత్రి ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ మూడేళ్లకే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం అక్రమాలపై కమిషన్ నివేదిక ఇవ్వడంతో ప్రజలు బీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం తమ ప్రభుత్వం బిల్లులు పంపితే కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.