అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flights | ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంపై ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ (IndiGo Airlines CEO Peter Elbers) స్పందించారు. ఆయన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. విమాన సేవలు సాధారణ స్థితికి వచ్చాయన్నారు. ఇండిగో సంక్షోభంతో వారం రోజులుగా అనేక ఫ్లైట్లు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విమానాలు ఆలస్యం, రద్దు (flight delays and cancellations) కావడంతో ఎయిర్ పోర్టుల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిస్థితిపై డీజీసీఏ విచారణ చేపట్టింది. ఇండిగో సీఈవోకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. తాజాగా సీఈవో స్పందిస్తూ.. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందన్నారు. మంగళవారం 1,800 విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్షలాది ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చెల్లించామని వెల్లడించారు.
Indigo Flights | అంతరాయం ఉండదు
ఇకపై ఇండిగో విమాన సేవల్లో (IndiGo flight services) ఎలాంటి అసౌకర్యం కలగదని సీఈవో తెలిపారు. బుధవారం దాదాపు 1,900 విమానాలను నడపాలని యోచిస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. 2006లో ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన కార్యాచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండిగో, దాని వెబ్సైట్లో చూపిన దాని షెడ్యూల్ చేయబడిన అన్ని విమానాలు సర్దుబాటు చేయబడిన నెట్‌వర్క్‌తో పనిచేస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయాలలో చిక్కుకున్న దాదాపు అన్ని బ్యాగులు కస్టమర్లకు డెలివరీ చేశామని సంస్థ పేర్కొంది. మిగిలిన వాటిని వీలైనంత త్వరగా డెలివరీ చేయడానికి సిబ్బంది చర్యలు చేపట్టారని తెలిపింది. ఇండిగో తన మొత్తం కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వంతో పూర్తి సహకారంతో పనిచేస్తూనే ఉందని ఎల్బర్స్ స్పష్టం చేశారు.