అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Macron) కు శనివారం ఫోన్ చేశారు. వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia – Ukraine war) ముగించే మార్గాలను కూడా ఇద్దరు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
PM Modi | వ్యూహాత్మక భాగస్వామ్యం
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చాలా మంచి సంభాషణ జరిగిందని, వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించుకున్నామని మోదీ పేర్కొన్నారు. “ఉక్రెయిన్ వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నాం. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది.” అని మోదీ తెలిపారు.
PM Modi | నెల వ్యవధిలోనే రెండుసార్లు
ఫ్రాన్స్‌తో సంబంధాలను ఇండియా బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, మక్రాన్ నెల వ్యవధిలోను రెండుసార్లు ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆగస్టు 21న మాక్రాన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, ఉక్రెయిన్లో యుద్ధ ముగింపునకు, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి జరుగుతున్న ప్రయత్నాలను చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పదేపదే ప్రయత్నిస్తోంది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలన్నారు.