అక్షరటుడే, వెబ్‌డెస్క్:PM Modi | భారతదేశం(India) నుంచి ఉగ్రవాద ముల్లును తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ విభజన జరిగిన 1947లో కాశ్మీర్‌లోకి చొరబడిన ముజాహిదీన్‌లను చంపి ఉంటే ఇప్పుడు ఉగ్రవాద సమస్యే ఉండకపోయేదని మోదీ(Prime Minister Modi)వ్యాఖ్యానించారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. మంగళవారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో రూ.5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా భారతదేశం నిర్వహించిన వైమానిక దాడుల్లో కేవలం 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. దీనిని అతిపెద్ద నిర్ణయాత్మక చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం, సైన్యం ఏం చేసినా రుజువులు అడుగుతారని, అలాంటి వారి పిలుపులను అణచివేయడానికి మొత్తం చర్యను కెమెరాలో రికార్డ్ చేశామని ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
PM Modi | ప్రాక్సీ వార్ కాదిది..
ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని 22 నిమిషాల్లోనే అంతం చేశామని మోదీ పునరుద్ఘాటించారు. మే 6న జరిగిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు పాకిస్తాన్(Pakistan)లో రాష్ట్ర గౌరవాలు ఇవ్వబడుతున్నందున దీనిని ఇకపై ప్రాక్సీ యుద్ధం(proxy war) అని పిలవలేమన్నారు. “పాకిస్తాన్ జెండాలను వారి (ఉగ్రవాదుల) శవపేటికలపై ఉంచారు. చనిపోయిన వారికి సైన్యం సెల్యూట్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు పరోక్ష యుద్ధం కాదని, బాగా ప్రణాళికాబద్ధమైన యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుంది. మీరు ఇప్పటికే యుద్ధంలో ఉన్నారు. మీకు తగిన విధంగా ప్రతిస్పందన లభిస్తుంది. మేము ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోము. మేము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము. ప్రపంచ సంక్షేమానికి దోహదపడేలా మేము కూడా పురోగతి సాధించాలనుకుంటున్నాము” అని మోదీ అన్నారు.
“ఇది ధైర్యవంతుల భూమి. ఇప్పటివరకు. మనం ప్రాక్సీ వార్ అని పిలిచేవాళ్లం. మే 6 తర్వాత దృశ్యాలు చూసిన తర్వాత.. దానిని ప్రాక్సీ వార్ అని పిలిచే తప్పు మనం ఇకపై చేయలేము. ఎందుకంటే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి కేవలం 22 నిమిషాల్లో నాశనం చేశాం. అది అతిపెద్ద నిర్ణయాత్మక చర్య. ఈసారి ఇంట్లో ఎవరూ రుజువు అడగకుండా ఉండటానికి ప్రతిదీ కెమెరాల ముందు జరిగింది” అని ప్రధాని వివరించారు.
PM Modi | ఉగ్ర ముల్లును తొలగిస్తాం..
ప్రధాని మోదీ(PM Modi) తన ప్రసంగంలో మరోసారి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. భారతదేశం నుంచి ఉగ్రవాద ముల్లును తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు, ఇది మీ యుద్ధ వ్యూహం, మీరు మాపై యుద్ధం చేస్తున్నారని పాక్(Pakistan)ను ఉద్దేశించి అన్నారు. సింధు జల ఒప్పందం భారత్‌కు నష్టం చేసేలా రూపొందించిందినదని, కాశ్మీర్‌లోని ఆనకట్టల పూడిక తీయడాన్ని కూడా నిషేధించే నిబంధన ఇందులో ఉందని మోదీ వివరించారు.
PM Modi | అప్పుడు చంపేస్తే వేరేలా ఉండేది..
1947లో కాశ్మీర్‌లోకి ప్రవేశించిన ముజాహిదీన్‌లను(Mujahideen) మనం చంపి ఉంటే, ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవాళ్ళం కాదని అన్నారు. “1947లో, మా భారతి విభజన జరిగినప్పుడు, దేశం మూడు భాగాలుగా విభజించబడింది. ఆ రోజు రాత్రి కాశ్మీర్‌లో మొదటి ఉగ్రవాద దాడి (Terrorist Attack) జరిగింది. మా భారతిలో కొంత భాగాన్ని ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదులను ఉపయోగించి పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఆ రోజున, ఈ ముజాహిదీన్‌లను చంపినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. పీవోకును స్వాధీనం చేసుకునే వరకు మన సాయుధ దళాలు విశ్రమించకూడదన్నది సర్దార్ పటేల్ కోరిక. కానీ ఎవరూ అతని మాట వినలేదు. ఇప్పుడు మనం గత 75 సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాము. పహల్గామ్ కూడా దానికి ఒక ఉదాహరణ. పాకిస్తాన్‌తో మనకు యుద్ధాలు జరిగినప్పుడు, మూడుసార్లు ఓడించామని” అని తెలిపారు.
PM Modi | అపారమైన ప్రేమకు నిదర్శనం..
“నేను గత రెండు రోజులుగా గుజరాత్‌లో ఉన్నా. నిన్న వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, ఈ ఉదయం గాంధీనగర్‌లను సందర్శించా. నేను ఎక్కడికి వెళ్లినా కాషాయ సముద్రం గర్జించే శబ్దంలా, దేశభక్తి తరంగంలా అనిపించింది. కాషాయ సముద్రం గర్జన, రెపరెపలాడే త్రివర్ణ పతాకం ప్రతి హృదయంలో మాతృభూమి పట్ల అపారమైన ప్రేమను చాటుతోంది. ఇది మరపురాని దృశ్యం” అని మోదీ(Modi) హర్షం వ్యక్తం చేశారు.
PM Modi | నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే..
ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్(India) ఎదిగిందని ప్రధాని తెలిపారు. 2014లో 11వ స్థానంలో ఉన్న ఇండియా ఇవాళ నాలుగో స్థానానికి చెరిందన్నారు. “2014 మే 26న నేను తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది.. నేడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు మనం జపాన్(Japan)ను అధిగమించడం మనందరికీ గర్వకారణం. మనం ఆరవ స్థానం నుంచి ఐదవ స్థానానికి చేరుకున్నప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతలో కనిపించిన ఉత్సాహం నాకు ఇప్పటికీ గుర్తుంది. కారణం, భారతదేశం 250 సంవత్సరాలు మనల్ని పాలించిన యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom)ను అధిగమించింది…” అని ప్రధాని మోదీ తెలిపారు.