అక్షరటుడే, వెబ్డెస్క్: Indian Economy | ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (financial year) తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉండగా, ఈసారి అంచనాలకు మించి నమోదైంది.
2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాస్తవ GDP లేదా స్థిర ధరల వద్ద GDP రూ.47.89 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. అంటే గతేడాది కంటే ఈసారి 7.8 శాతం మేర అధిక వృద్ధి రేటును (higher growth rate) సూచిస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం (National Statistics Office) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నామమాత్రపు GDP లేదా ప్రస్తుత ధరల వద్ద GDP రూ.86.05 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.79.08 లక్షల కోట్లుగా ఉంది, ఇది 8.8 శాతం వృద్ధి రేటును చూపుతోంది.
Indian Economy | అంచనాలకు మించి..
తాజా గణాంకాల ప్రకారం.. వృద్ధి రేటు అంచనాల మించి నమోదైంది. తొలి త్రైమాసికంలో 6.8 లేదా 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని SBI పరిశోధన నివేదిక (SBI Research report) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన 1.5 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, 2025-26 సంవత్సరానికి వాస్తవ GDP వృద్ధిని 6.5 శాతంగా, Q1లో 6.5 శాతంగా, Q2లో 6.7 శాతంగా, Q3లో 6.6 శాతంగా, Q4లో 6.3 శాతంగా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) అంచనా వేసింది.
ఆర్థిక విశ్లేషకులు అంచనా వేసిన 6.5 శాతం కంటే ఈ త్రైమాసికం వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. బలమైన స్థూల ఆర్థిక కారణాలు వృద్ధికి దోహదం చేశాయి. వ్యవసాయంతో (agriculture) పాటు సేవలు, తయారీ రంగం బలంగా ఉండడం ప్రస్తుత వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం వృద్దిలో దూసుకు పోతుండడం విశేషం. అయితే, ప్రపంచ ప్రతికూలతలతో పాటు అమెరికా టారిఫ్లను (US tariffs) అధిగమించడానికి వ్యూహాత్మక, వివేకవంతమైన విధాన నిర్వహణ అవసరం.
Indian Economy | కీలక రంగాల్లో పురోగతి..
గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన 1.5 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, వ్యవసాయం, అనుబంధ రంగం వాస్తవ GVA వృద్ధి రేటు 3.7 శాతంగా నమోదైంది. ద్వితీయ రంగాలు (Secondary sectors) ముఖ్యంగా తయారీ (7.7 శాతం), నిర్మాణ (7.6 శాతం) రంగం ఈ త్రైమాసికంలో స్థిర ధరల వద్ద 7.5 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేశాయి. వ్యవసాయ రంగం (agriculture sector) 3.7 శాతం వృద్ధిని సాధించింది. ఇది గతేడాది ఇదే కాలంలో 1.5 శాతం మాత్రమే ఉంది. గత వృద్ధితో పోలిస్తే ఇది చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పవచ్చు.
మంచి పంటల దిగుబడి, వర్షాల ప్రభావం, గ్రామీణ ఆదాయం పెరగడం వల్ల వ్యవసాయ వృద్ది పెరిగినట్లు తెలుస్తోంది. మాన్యుఫాక్చరింగ్ రంగం కూడా బాగానే పనిచేసింది. 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం త్రైమాసికంలో 7.6 శాతం ఉండేది. సేవల రంగం ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ (real estate) వంటి విభాగాలు ఈ త్రైమాసిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, టెక్నాలజీ సేవలు విస్తరించడం వల్ల ఈ రంగం చురుగ్గా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మైనింగ్ & క్వారీయింగ్ (-3.1 శాతం), విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర యుటిలిటీ సేవల రంగం (0.5 శాతం) మధ్యస్థ వాస్తవ వృద్ధి రేటును చూశాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6.8 శాతం వృద్ధి రేటు (Growth rate) కంటే, తృతీయ రంగం (9.3 శాతం) 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థిర ధరల వద్ద గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నామమాత్రపు పరంగా 9.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (GFCE) తిరిగి పుంజుకుంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.0 శాతం వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంది.