అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం నవి ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది.
ఈ గెలుపుతో భారత మహిళల జట్టు తమ మూడో ప్రయత్నంలోనే తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి వికెట్ పడగానే దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా (Team India) ప్రయాణం రోలర్‌కోస్టర్‌లా సాగింది. టోర్నీ ఆరంభంలో ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన భారత్, తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే అనంతరం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై సెమీస్ చేరడం కష్టమని అనిపించింది.
Womens World Cup | విమర్శల నుంచి విజయ శిఖరాలకు..
కానీ కివీస్‌పై కీలక విజయం సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. ఆ తర్వాత భారత మహిళలు అద్భుత ఫామ్‌లోకి వచ్చి ప్రతి మ్యాచ్‌లో సంచలనం సృష్టించారు. లీగ్ దశలో వరుస ఓటముల తర్వాత సోషల్ మీడియాలో టీమిండియా మహిళలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. “మీకు క్రికెట్ ఎందుకు?” “మీరు వంటింట్లో ఉండాలి” అనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ టీమిండియా ఆ విమర్శలను పట్టించుకోలేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తిరిగి రాణించింది. సెమీఫైనల్లో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆ ఉత్సాహాన్ని ఫైనల్లో కొనసాగిస్తూ సౌతాఫ్రికా (South Africa)పై చారిత్రక విజయాన్ని సాధించింది.
విమర్శలను తిప్పికొట్టి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అద్భుత నాయకత్వంతో జట్టును విజయతీరాలకు చేర్చింది. భారత మహిళల విభాగంలో తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్‌గా ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఫైనల్లో స్మృతి మంధాన 45 పరుగులతో మెరిసింది. మరోవైపు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పింది. ఆమె ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ఆడిన షఫాలీ వర్మ (Shafali Verma) కూడా తన దూకుడు ఆటతో ప్రేక్షకులను అలరించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. నగరాల్లో బాణాసంచా కాల్చుతూ అభిమానులు జట్టు విజయాన్ని జరుపుకున్నారు. సోషల్ మీడియాలో #IndiaWomenChampions ట్రెండ్ అయ్యింది.ఈ ప్రపంచకప్ (World Cup) విజయంతో భారత్‌లో మహిళల క్రికెట్ ముఖచిత్రం మారబోతోందని నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరగడం ఖాయం. ఈ విజయం ప్రేరణగా చాలా మంది అమ్మాయిలు క్రికెట్ వైపు అడుగులు వేయడం కూడా ఖాయం.