అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Rally | యూఎస్, భారత్‌ల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన కుదరడం, ఎఫఐఐలు నికర కొనుగోలుదారులుగా నిలవడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగివస్తుండడం వంటి కారణాలు దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో సానుకూల సెంటిమెంట్‌ను పెంచాయి. ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ మూడో త్రైమాసికంలో అద్భుత పనితీరును కనబరచడంతో సూచీలు పరుగులు తీశాయి.
బలమైన దేశీయ వినియోగం, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇది జీ-20 ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైన వృద్ధి అని పేర్కొంది. మూడీస్ అంచనాలు కూడా మన మార్కెట్లలో ర్యాలీకి కారణమయ్యాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 597 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమై వెంటనే 317 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని తిరిగి 454 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 195 పాయింట్ల లాభంతో ప్రారంభమై, అక్కడినుంచి 108 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి పుంజుకుని 142 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 485 పాయింట్ల లాభంతో 84,065 వద్ద, నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 25,867 వద్ద స్థిరపడ్డాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్ విశేషంగా రాణించాయి.
యుటిలిటీ సెక్టార్ మినహా..
యుటిలిటీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ యుటిలిటీ ఇండెక్స్ 0.03 శాతం నష్టపోయింది. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్, రియాలిటీ, టెలికాం, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు రాణించాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,110 కంపెనీలు లాభపడగా 1,254 స్టాక్స్ నష్టపోయాయి. 163 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 148 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.12 లక్షల కోట్లు పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఎస్బీఐ 7.46 శాతం, టైటాన్ 2.78 శాతం, టాటా స్టీల్ 2.56 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.36 శాతం ఎటర్నల్ 1.91 శాతం లాభపడ్డాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 1.11 శాతం, ఐటీసీ 1.07 శాతం, ఎన్టీపీసీ 1.05 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.68 శాతం, ఇన్ఫోసిస్ 0.65 శాతం నష్టపోయాయి.