అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Rally | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) ప్రారంభ నష్టాలనుంచి కోలుకుంది. ఆటో, మీడియా రంగాలు మినహా మిగిలిన రంగాలు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. రూపాయి విలువ ఫ్లాట్‌గా ఉన్నా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
కనిష్టాల వద్ద కొనుగోళ్లకు పాల్పడడంతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 206 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 204 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 1,057 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 51 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాలనుంచి కోలుకుని పైకి ఎగబాకిన నిఫ్టీ (Nifty) 325 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో 83,277 వద్ద, నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 25,682 వద్ద స్థిరపడ్డాయి.
ఆటో, మీడియా రంగాలు మినహా..
ఆటో, మీడియా సెక్టార్లు మినహా మిగిలిన రంగాల షేర్లు రాణించాయి. పవర్, యుటిలిటీ రంగాల ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి. ఫార్మా, ఎనర్జీ, రియాలిటీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫఎంసీజీ, కన్జూమర్ డ్యూరెబుల్స్ రంగాల షేర్లు కూడా గణనీయంగా పెరిగాయి. ఆటో, మీడియా ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,793 కంపెనీలు లాభపడగా 2,510 స్టాక్స్ నష్టపోయాయి. 193 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 106 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 211 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 4.45 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.19 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.93 శాతం, ఎన్టీపీసీ 1.60 శాతం, ఐటీసీ 1.39 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్ మహీంద్రా 1.44 శాతం, మారుతి 1.13 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.08 శాతం, ట్రెంట్ 0.78 శాతం, ఎం&ఎం 0.69 శాతం నష్టపోయాయి.