అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వివిధ దేశాలపై విధించిన సుంకాలను అక్కడి సుప్రీం కోర్ట్ కొట్టివేయడంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.
భారత బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. అయితే సుంకాల భారం తగ్గినందున ఎగుమతి ఆధారిత రంగాలకు ఇది మేలు చేస్తుందన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా వస్త్ర రంగానికి చెందిన స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి.
కాగా సుప్రీంకోర్ట్ (Supreme Court) తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. 15 శాతం తాత్కాలిక సుంకాలను విధించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ అదనపు సుంకాలనూ కోర్టులో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి.సోమవారం ఉదయం సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 580 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 580 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 93 పాయింట్లు పైకి ఎగబాకింది. గరిష్టాలవద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 145 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 83,128 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 25,658 వద్ద ఉన్నాయి.
ఐటీలో కొనసాగుతున్న పతనం..
ఐటీ సెక్టార్‌లో పతనం ఆగడం లేదు. సోమవారం ఇంట్రాడేలో నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ గరిష్టంగా 1.75 శాతానికిపైగా నష్టపోయింది. మీడియా, మెటల్, బ్యాంకింగ్, టెలికాం, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు నష్టాలతో సాగుతున్నాయి. ఫైనాన్షియల్, ఆటో రంగాల ఇండెక్స్‌లు అర శాతానికిపైగా లాభంతో ఉండగా.. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షూర్లు ఓ మోస్తరుగా రాణిస్తున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 11 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానిపోర్ట్స్ 2.78 శాతం, కొటక్ బ్యాంక్ 2.03 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.96 శాతం, పవర్‌గ్రిడ్ 1.10 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.07 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 2.33 శాతం, టెక్‌మహీంద్రా 1.38 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.02 శాతం, ఎటర్నల్ 0.74 శాతం, బీఈఎల్ 0.67 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
