అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Gains | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. చాలా దేశాల మార్కెట్లకు సెలవు కావడం, ఎఫఐఐల అమ్మకాలు, రూపాయి విలువలో బలహీనత కొనసాగడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ప్రధాన సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగాయి.
మెటల్ సెక్టార్లో సెల్లాఫ్ కొనసాగినా ఆంథ్రోపిక్‌తో సహకారం గురించి ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో ఐటీ సెక్టార్ పరుగులు తీయడంతో సూచీలు కోలుకున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 210 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 611 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 67 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 194 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 83,450 వద్ద, నిఫ్టీ (Nifty) 42 పాయింట్ల లాభంతో 25,725 వద్ద స్థిరపడ్డాయి.
కోలుకున్న ఐటీ సెక్టార్..
ఆంథ్రోపిక్‌తో సహకారం గురించి ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో ఐటీ సెక్టార్ స్టాక్స్ రాణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 1.03 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరెబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఫార్మా, యుటిలిటీ రంగాల షేర్లు లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.06 శాతం నష్టపోయింది. రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,447 కంపెనీలు లాభపడగా 1,756 స్టాక్స్ నష్టపోయాయి. 149 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 116 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 144 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఐటీసీ 2.31 శాతం, బీఈఎల్ 2.02 శాతం, ఎల్టీ 1.84 శాతం, ఇన్ఫోసిస్ 1.83 శాతం, ఆసియన్ పెయింట్స్ 1.67 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎటర్నల్ 1.56 శాతం, టాటా స్టీల్ 1.29 శాతం, ట్రెంట్ 1.28 శాతం, రిలయన్స్ 0.95 శాతం, ఎం&ఎం 0.59 శాతం నష్టపోయాయి.