అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apple COO | ఆపిల్(Apple) కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్ (Sabih Khan) నియమితులయ్యారు. ఆయన జెఫ్ విలియమ్స్ (Jeff Williams) స్థానంలో ఈ నెలాఖరులో బాధ్యతలు స్వీకరించనున్నారు.
సబిహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్(Utterpradesh)లోని మొరాదాబాద్‌లో జన్మించారు. చిన్నప్పుడే ఆయన కుటుంబం సింగపూర్‌కు మకాం మార్చింది. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయం(Tufts University) నుంచి ఆర్థిక శాస్త్రం, మెకానికల్ ఇంజినీరింగ్‌లలో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు, రెన్సెలాయర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్(Rensselaer Polytechnic Institute) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1995లో ఆపిల్ చేరారు. అంతకుముందు ఆయన జీఈ ప్లాస్టిక్స్(GE Plastics)లో అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ఆపిల్ కంపెనీలో సేవలందిస్తున్నారు. తన పనితీరుతో ఆపిల్‌లో క్రమంగా కీలక స్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2019 నుంచి ఈ బాధ్యతల్లో ఉన్నారు. ఆయన ప్రణాళిక, సేకరణ, తయారీ, లాజిస్టిక్స్, ఉత్పత్తి పంపిణీని పర్యవేక్షిస్తూ సంస్థ ప్రగతిలో భాగస్వామిగా ఉన్నారు. సంస్థకు భారత్ అత్యంత వ్యూహాత్మక మార్కెట్‌గా, ప్రాంతంగా మారుతున్న నేపథ్యంలో ఖాన్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని కంపెనీ నిర్ణయించింది. సీవోవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా.. 2015 నుంచి సీవోవోగా ఉన్న జెఫ్ విలియమ్స్(Jeff Williams).. 2025 చివరిలో రిటైర్ కానున్నారు. అప్పటివరకు ఆయన యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత డిజైన్ టీమ్ నేరుగా కుక్‌కు రిపోర్ట్ చేస్తుంది. యూఎస్ టారిఫ్‌లు, నియంత్రణ పరిశీలన వంటి ప్రపంచ సవాళ్ల నడుమ ఈ నాయకత్వ మార్పు భారతదేశంలో తయారీని విస్తరించడంపై యాపిల్ వ్యూహాత్మక దృష్టికి అనుగుణంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Apple COO | సీఈవో ప్రశంసలు..
సబిహ్ ఖాన్‌ను ఆపిల్ సీఈవో(CEO) టిమ్ కుక్ (Tim Cook) ప్రశంసించారు. పర్యావరణ స్థిరత్వానికి సబిహ్ ఖాన్ గణనీయమైన కృషి చేశారన్నారు. ఆపిల్‌కు చెందిన కార్బన్ ఫూట్‌ప్రింట్‌ను 60 శాతానికి పైగా తగ్గించడంలో ఆయన ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. అధునాతన తయారీ సాంకేతిక పరిజ్ఞానాలలో ఆవిష్కరణలను నడిపించారని, యునైటెడ్ స్టేట్స్(US)లో ఆపిల్ తయారీ ఉనికిని విస్తరించడంతో కృష్టి చేశారని, ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా కంపెనీ సామర్థ్యాన్ని పెంచారని ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
‘సబిహ్ ఒక తెలివైన వ్యూహకర్త. ఆపిల్ సరఫరా గొలుసును పర్యవేక్షిస్తూనే అధునాతన తయారీలో కొత్త సాంకేతికతలను అందించడంలో సహాయపడ్డారు. యూఎస్‌లో తయారీ సౌకర్యాలను విస్తరించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థ నిలబడడంలో సహాయపడ్డారు’ అని కుక్ ఒక ప్రకటనలో తెలిపారు.