Homeబిజినెస్​Stock Market | దుమ్మురేపిన భారత మార్కెట్లు.. ఐదేళ్లలో ఇక్కడే ఎక్కువ లాభాలు

Stock Market | దుమ్మురేపిన భారత మార్కెట్లు.. ఐదేళ్లలో ఇక్కడే ఎక్కువ లాభాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | మన స్టాక్‌ మార్కెట్లు(Stock markets) దుమ్మురేపుతున్నాయి. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల(Global markets)తో పోల్చితే ఐదేళ్లుగా ఇక్కడే ఎక్కువ రాబడులు(డాలర్‌ పరంగా) వస్తుండడం గమనార్హం.

భారత స్టాక్‌ మార్కెట్‌ 5 సంవత్సరాలలో గణనీయమైన రాబడులు (Returns) అందించింది. 2020 నుంచి 2025 మార్చి వరకు 177 శాతం అంటే ఏటా 18 శాతం సీఏజీఆర్‌తో రాబడి వచ్చింది. ఇతర గ్లోబల్‌ మార్కెట్లలో పోల్చితే ఇదే అత్యధికం. Nifty-50 కూడా ఇదే కాలంలో 95.3 శాతం అంటే ఏటా సగటున 15 నుంచి 18 శాతం వరకు వృద్ధిని కనబరిచింది. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌(Small cap stocks) మరింత మెరుగ్గా రాణించాయి. ఇదే సమయంలో జపాన్‌ నిక్కీ(Nikkei) 81 శాతం, జర్మనీ(డీఏఎక్స్‌) 52 శాతం రాబడులతో రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. ప్రపంచ రాబడి 12 శాతంగా ఉండడం కావడం గమనార్హం.

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఐదేళ్లలో 18 శాతం, మూడు నెలల్లో 16 శాతం రిటర్న్స్‌ అందించింది. అభివృద్ధి చెందిన దేశాల సూచీలు ఐదేళ్లలో 12 శాతం రాబడిని, మూడు నెలల్లో 2 శాతం రాబడిని అందించాయి. ఇదే సమయంలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు ఐదేళ్లలో 4 శాతం, మూడు నెలల్లో 5 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి వచ్చే రాబడి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మన మార్కెట్లు రాబడిని ఇచ్చాయని ఫండ్‌ హౌస్‌(Fund House) పేర్కొంది. బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ జూన్‌ నెలవారీ మార్కెట్‌ ఔట్‌లుక్‌ ప్రకారం మన స్టాక్‌ మార్కెట్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ సహచరులను అధిగమించింది.

Stock Market | స్మాల్‌ క్యాప్‌లో భారీ లాభాలు..

మన స్టాక్‌ మార్కెట్‌లో దీర్ఘకాలం(Long term)లోనే కాదు.. మూడు నెలల స్వల్ప కాలంలోనూ స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్ల(Investors)కు కాసుల పంట పండించాయి. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఐదేళ్లలో 36 శాతం, గత మూడు నెలల్లో 21 శాతం లాభాలనిచ్చాయి. మిడ్‌ క్యాప్‌ (Mid cap) స్టాక్స్‌ ఐదేళ్లలో 32 శాతం, మూడు నెలల్లో 17 శాతం రాబడినిచ్చాయి. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఐదేళ్లలో 22 శాతం, మూడు నెలల్లో 13 శాతం పెరిగాయి.

Stock Market | బలమైన పనితీరుతో అగ్రస్థానానికి..

మనదేశం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా మన మార్కెట్లలోకి వచ్చాయి. సేవారంగంలో మన దేశం గణనీయమైన పురోగతి సాధించింది. దేశీయంగానూ స్టాక్‌ మార్కెట్లపై అవగాహన పెరిగింది. ప్రధానంగా కోవిడ్‌ తర్వాత చాలామంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌లోకి వచ్చారు. డీమ్యాట్‌ అకౌంట్స్‌ (Demat accounts) బాగా పెరిగాయి. దాదాపు ప్రతి ఐదు కుటుంబాలలో ఒక కుటుంబానికి డీమ్యాట్‌ ఖాతా ఉందని అంచనా. అలాగే మన దేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తూ రావడంతో ఇన్వెస్టర్లలో మన మార్కెట్లపై నమ్మకం పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. దీంంతో మన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీలుగా ఎదిగాయి. వీటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ఇటీవలి కాలంలో మన మార్కెట్లు కరెక్షన్‌కు గురైనప్పటికీ దీర్ఘ కాలంలో బలమైన పనితీరును కనబరుస్తూ ముందుకు సాగుతున్నాయి.