అక్షరటుడే, వెబ్డెస్క్: Indian Exports | భారత ఎగుమతులు గత పదేళ్ల గరిష్టస్థాయికి చేరాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Union Ministry of Commerce and Industry) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దీంతో భారతదేశ వాణిజ్య లోటు గణనీయంగా తగ్గింది. 2025 నవంబర్లో దేశ వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గత సంవత్సరం ఇదే నెలలో ఇది 31.93 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం దిగుమతులు తగ్గడంతో పాటు ఎగుమతులు బాగా పెరగడమేనని చెప్పవచ్చు.
Indian Exports | క్షీణించిన దిగుమతులు
నవంబర్లో దేశ దిగుమతులు 1.88 శాతం క్షీణించి 62.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే ఎగుమతులు 23.15 శాతం భారీ వృద్ధితో 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత పదేళ్లలో ఈ స్థాయి ఎగుమతులు నమోదు కావడం గమనార్హం. ఈ వృద్ధిలో ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, ఔషధాలు, ఫార్మా రంగాలు ముఖ్య భూమిక పోషించాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Commerce Secretary Rajesh Agarwal) వెల్లడించారు.
కాగా.. నవంబర్లో బంగారం దిగుమతులు 60 శాతం మేర తగ్గాయి. పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెలు, బొగ్గు వంటి ఇతర కీలక దిగుమతుల్లోనూ గణనీయ క్షీణత ఏర్పడిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (financial year) (2025-26) ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల కాలంలో ఎగుమతులు 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 5.59 శాతం వృద్ధితో 515.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Indian Exports | టారిఫ్ల ఒత్తిడి ఉన్నా..
అధికారిక గణాంకాల ప్రకారం.. నవంబర్లో అమెరికాకు భారత ఎగుమతులు గతేడాది కంటే 22 శాతం పెరిగి 6.97 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా విధించిన టారిఫ్లకు అతీతంగా ఎగుమతులను సాగించగలిగామని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.