Homeక్రీడలుInd vs Aus | ఆస్ట్రేలియా బౌల‌ర్లను చీల్చి చెండాడిన శ్రేయాస్, ప్రియాన్స్.. 171 పరుగుల...

Ind vs Aus | ఆస్ట్రేలియా బౌల‌ర్లను చీల్చి చెండాడిన శ్రేయాస్, ప్రియాన్స్.. 171 పరుగుల తేడాతో భారీ విజయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ind vs Aus | కాన్పూర్ (Kanpur) వేదికగా భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-ఏ జట్టు అసాధారణ ప్రదర్శనతో 171 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

శ్రేయస్ అయ్యర్ (Shreyas ayyer), ప్రియాన్ష్ ఆర్య సెంచరీలతో రాణించగా, బౌలింగ్‌లో నిశాంత్ సింధూ చక్కటి ప్రదర్శనతో ఆసీస్ బ్యాటింగ్‌ను కుప్ప‌కూల్చాడు. భారత్ బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లకు చుక్కలు క‌నిపించాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏ జట్టు 50 ఓవర్లలో 413/8 పరుగులు చేయడం విశేషం.

Ind vs Aus | వీర విహారం

శ్రేయస్ అయ్యర్ 83 బంతుల్లో 110 (12 ఫోర్లు, 4 సిక్సులు), ప్రియాన్ష్ ఆర్య 84 బంతుల్లో 101 (11 ఫోర్లు, 5 సిక్సులు) ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగినప్పటికీ మిగతా బ్యాటర్లు కూడా దూకుడుగా ఆడారు. రియాన్ పరాగ్ 67 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 56 పరుగులు, ఆయుష్ బదోని 50 పరుగులు చేశారు. ఈ క్ర‌మంలో టీమిండియా-ఏ ఏకంగా 400కి పైగా స్కోర్ చేయడంతో ఆసీస్ జట్టుపై మానసికంగా ఒత్తిడి పెరిగింది. లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ (Australia) జట్టు 414 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, 33.1 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయింది. మెకెంజీ హార్వే – 68 పరుగులతో రాణించాడు. విల్ల్ సదర్లాండ్ – 50, లాచ్లాన్ షా – 45 ప‌రుగులు చేయ‌గా, మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు.

భారత్ బౌలింగ్​లో నిశాంత్ సింధూ 6.1 ఓవర్లలో 50 పరుగులకు 4 వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ – 2 వికెట్లు, సిమ్రాన్ జీత్ సింగ్, యుద్ధ్ వీర్ సింగ్, ఆయుష్ బదోని తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో (Batting) ఆక‌ట్టుకున్న శ్రేయాస్ అయ్య‌ర్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించారు. ఈ ఘనవిజయం భారత్-ఏ జట్టుకు శుభ సంకేతం. తదుపరి వన్డేల్లో ఈ జట్టు ఆట‌గాళ్లు ఇదే ఫామ్‌ని కొన‌సాగిస్తే జాతీయ జట్టులో త‌ప్ప‌క చోటు దొర‌కుతుంది.