Trump
Trump Tariffs | భారత్‌పై ప‌న్నుల మోత త‌ప్ప‌దు.. ట్రంప్ హెచ్చ‌రిక‌.. అసంజ‌స‌మ‌న్న ఇండియా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | రష్యా నుంచి చౌక‌గా చ‌మురు కొనుగోలు చేస్తుండ‌డాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌ట్టుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికే 25 శాతం టారిఫ్ విధించిన‌ప్ప‌టికీ ఇండియా వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌రోసారి బెదిరింపుల‌కు దిగారు. భార‌త్‌(India)పై మ‌ళ్లీ సుంకాలు పెంచుతామ‌ని హెచ్చ‌రించారు. ర‌ష్యా నుంచి చ‌మురు కొనొద్ద‌ని చెబుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, దీంతో మ‌రిన్ని టారిఫ్‌లు విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, అమెరికా(America) హెచ్చ‌రికల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కొట్టిప‌డేసింది. ట్రంప్ వైఖ‌రి అస‌మంస‌మ‌ని పేర్కొంది.

Trump Tariffs | మ‌రిన్ని ప‌న్నులు

ర‌ష్యా(Russia) నుంచి భార‌త్ చౌక‌గా చ‌మురు కొనుగోలు చేసి, దాన్ని బ‌య‌ట మార్కెట్‌లో విక్ర‌యించుకుంటూ లాభాలు గ‌డిస్తోంద‌ని ట్రంప్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. భార‌త్ పెద్ద మొత్తంలో చ‌మురు కొనుగోలు చేస్తుండ‌గా, ఆ నిధుల‌ను ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెచ్చిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ప‌న్నులు పెంచుతామ‌ని హెచ్చ‌రించారు. ‘రష్యా యుద్ధంలో ఎంతో మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నా ఇండియా పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి ఆయిల్ కొంటూ ఆ దేశానికి నిధులు సమకూర్చడం ఆపడం లేదు. కాబట్టి మున్ముందు మరింతగా సుంకాలు పెంచుతాను’ అని త‌న సోష‌ల్ మీడియా ట్రూత్(Social Media Truth) లో ట్రంప్ హెచ్చరించారు.

Trump Tariffs | కొట్టిప‌డేసిన కేంద్రం..

రష్యాతో వాణిజ్యం కొనసాగుతుండటంపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన హెచ్చరికకు వ్యతిరేకంగా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అదే స‌మ‌యంలో అగ్ర‌రాజ్యం అవ‌లంభిస్తున్న ద్వంద వైఖ‌రిని గట్టిగా నిల‌దీసింది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) స్ప‌ష్టం చేసింది. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది. ఇంధ‌న కొనుగోలు నిర్ణ‌యాలు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ద్వారా కాకుండా జాతీయ ప్ర‌యోజ‌నాలు, ప్ర‌పంచ వాస్త‌వ ప‌రిస్థితుల‌పై ఆధార‌ప‌డి మాత్ర‌మే జరుగుతాయ‌ని తేల్చి చెప్పింది. భారతదేశం “భారీ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసి, పెద్ద లాభాల కోసం బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు” అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన కొన్ని గంటల తర్వాత న్యూఢిల్లీ(New Delhi) నుంచి ఈ పదునైన స్పందన వచ్చింది.

Trump Tariffs | ద్వంద వైఖ‌రి స‌రికాదు..

రష్యా నుంచి భారతదేశం చేసే ముడి చమురు(Crude Oil) కొనుగోళ్లు మాస్కోకు రాజకీయ మద్దతుగా చేస్తున్న‌ది కాద‌ని, త‌మ దేశ ఆర్థిక అవసరాల దృష్ట్యా జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. “భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది” అని నొక్కి చెప్పింది. మ‌రోవైపు, ర‌ష్యాతో ఇండియా చేస్తున్న వాణిజ్యం పై ప్ర‌శ్నిస్తున్న అమెరికా.. మ‌రీ ఆ దేశం నుంచి ఎందుకు కీల‌క‌మైన ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తోంద‌ని ప్ర‌శ్నించింది. “ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాను అమెరియా, ఈయూ లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ అరుదైన ఖ‌నిజాలను అమెరికా ఇంకా ఎందుకు దిగుమ‌తి చేసుకుంటోంద‌ని” ప్ర‌శ్నించింది.