అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs Pakistan Concerns | టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ అభిమానుల్లో కొంత ఆందోళన మొదలైంది. నమీబియా (Namibia)పై 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించినా జట్టులో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి.
ముఖ్యంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగబోయే హై–వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఈ బలహీనతలు చర్చనీయాంశమయ్యాయి. క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ లోపాలను వెంటనే సరిదిద్దుకోకపోతే పాక్ మ్యాచ్‌లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
India vs Pakistan Concerns | అదే తడబాటు..
స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత మిడిల్ ఆర్డర్ తడబడటం ఆందోళన కలిగిస్తోంది. నమీబియాపై పవర్‌ప్లేలో ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు దూకుడుగా ఆడినప్పటికీ మధ్య ఓవర్లలో మాత్రం రన్స్ రావడం మందగించింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ స్పిన్ (Gerhard Erasmus Spin) వలలో భారత బ్యాటర్లు వరుసగా చిక్కడం మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. కేవలం 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం ద్వారా అతడు మిడిల్ ఆర్డర్ బలహీనతను బయటపెట్టాడు. స్ట్రైక్ రొటేషన్‌లో విఫలమవడం, ఒత్తిడిలో వికెట్లు పారేయడం టీమిండియాకు పెద్ద మైనస్‌గా మారింది. పాకిస్థాన్ వద్ద నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ బలహీనతను వారు క్యాష్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
డెత్ ఓవర్లలో బ్యాటింగ్ పూర్తిగా నీరసించడం. ఒక దశలో భారత్ ఓవర్లకు 184 పరుగులు చేసి 220 మార్క్ దాటుతుందనిపించినా చివరి నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఫినిషింగ్ రోల్లో రింకూ సింగ్ (Rinku Singh), శివం దూబే (Shivam Dubey) వంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన పాక్ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో వచ్చే అదనపు 15–20 పరుగులే గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉండటంతో ఈ లోపం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మూడవది కొత్త బంతితో పేస్ దాడిలో స్థిరత్వం లేకపోవడం. ప్రధాన పేసర్లలో ఒకడైన అర్ష్‌దీప్ సింగ్ నమీబియాతో మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్లు తీయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ఓపెనర్లు కట్టడి చేయాలంటే కొత్త బంతితో వికెట్లు చాలా కీలకం. ఈ బాధ్యతను పూర్తిగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై మాత్రమే మోపడం ప్రమాదకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది