అక్షరటుడే, వెబ్‌డెస్క్: India US Interim Trade Deal | భారత్-అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించిన అధికారిక ముసాయిదా విడుదలైంది. దీంతో ఇరు దేశాల నేతలు ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రకటనలు విడుదల చేశారు.
ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కారణంగా భారతీయ ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ (American market) అందుబాటులోకి రానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ప్రకటించారు. ముఖ్యంగా ఎంఎసఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
India US Interim Trade Deal | ఉపాధి అవకాశాలు మెరుగు..
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా దేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల తయారీ, సేవా రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరిగి మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
ఏఏ రంగాలకు మేలంటే..
యూఎస్, భారత్‌ల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం వల్ల మన ఎగుమతిదారులకు మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎసఎంఈ), వ్యవస్థాపకులు మరియు స్టార్టప్ ఆవిష్కర్తలు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడానికి భారీ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అమెరికా తన దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల టెక్స్టైల్స్, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాలకు చెందిన తయారీదారులు గొప్ప లాభాలను పొందే అవకాశాలున్నాయి.
తగ్గనున్న ధరలు..
భారత్ -అమెరికాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందంతో విమాన విడిభాగాలు, జెనరిక్ మందులు (Generic Medicines), రత్నాలు, వజ్రాలపై సుంకాలు సున్నాకి తగ్గనున్నాయి. ఎంపిక చేసిన అమెరికన్ యంత్రాలు (American Machines), ఆటో విడిభాగాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. పలు రకాలు మద్యం బ్రాండ్ల ధరలు కూడా తగ్గనున్నాయి. అయితే ఈ ఒప్పందం కారణంగా అనేక అమెరికన్ ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో మన కంపెనీలు తీవ్ర పోటీని ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
రైతులకు నష్టం కలగకుండా..
భారత్ తన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాజా ఒప్పందంలో రక్షణాత్మకంగా వ్యవహరించింది. అమెరికా నుంచి వచ్చే చౌకైన అగ్రి ఉత్పత్తుల వల్ల మన రైతులు నష్టపోకుండా జాగ్రత్త పడింది. ప్రధానంగా సున్నితమైన వ్యవసాయ, పాడి ఉత్పత్తులైన మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్‌తో పాటు కొన్నిరకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. అన్ని వాణిజ్య చర్చల్లో రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.