HomeUncategorizedIndus River | పాక్‌కు షాక్ ఇవ్వ‌నున్న ఇండియా.. సింధు జ‌లాల మ‌ళ్లింపున‌కు య‌త్నాలు

Indus River | పాక్‌కు షాక్ ఇవ్వ‌నున్న ఇండియా.. సింధు జ‌లాల మ‌ళ్లింపున‌కు య‌త్నాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indus River | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్‌(Pakistan)కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న ఇండియా.. మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆ దేశంతో ఉన్న ద‌శాబ్దాల నాటి సింధు జ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం(Central Government).. మిగులు జ‌లాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంపై దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలోనే పంజాబ్‌, హ‌ర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల‌కు నీటిని త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల‌కు మిగులు జ‌లాల‌ను మ‌ళ్లించ‌డానికి 113 కిలోమీట‌ర్ల పొడ‌వైన కాలువ నిర్మించ‌డానికి సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తోంది.

Indus River | చుక్క‌నీరు కూడా వెళ్ల‌కుండా..

జమ్మూకాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఏప్రిల్ 22న జ‌రిగిన ఉగ్ర దాడితో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్తాన్‌తో అన్ని ర‌కాల సంబంధాల‌ను తెంచుకుంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌తో 1960వ ద‌శ‌కంలో చేసుకున్న ఒప్పందాన్ని సైతం ర‌ద్దు చేసింది. నీళ్లు, ర‌క్తం క‌లిసి ప్ర‌వ‌హించ‌లేవ‌ని స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. సింధు జ‌లాల‌ను నిలిపి వేసింది. భార‌త నిర్ణ‌యంతో పాకిస్తాన్ ఎడారిగా మార‌నుండ‌గా, మిగులు జ‌లాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. నాలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చుకునేందుకు సింధు నదీ(Indus River) జలాలను మళ్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజస్థాన్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ అవసరాలకు సింధు జలాలను వినియోగించుకోవాలని, దీని అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర జలశక్తి శాఖ(Central Water Resources Department) పని చేస్తున్న‌ట్లు తెలిసింది.

Indus River | ప్రాజెక్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌..

సింధు నదీ నుంచి నీటిని ఉపయోగించుకోవడానికి కేంద్రం త్వరితగ‌తిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్(Punjab), హర్యానా(Haryana), రాజస్థాన్‌(Rajasthan)లకు మిగులు ప్రవాహాలను మళ్లించడానికి 113 కి.మీ పొడవైన కాలువను నిర్మించడానికి సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉజ్ బహుళార్ధసాధక (జల విద్యుత్, నీటిపారుదల, తాగునీరు) ప్రాజెక్టును కూడా కేంద్రం పునరుద్ధరిస్తుంది. చీనాబ్‌ను రావి-బియాస్-సట్లెజ్‌తో కలిపే ఈ కాలువ తూర్పు నదులను (రావి, బియాస్, సట్లెజ్) పూర్తిగా ఉపయోగించుకోవడమే కాకుండా, సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులలో (సింధు, జీలం, చీనాబ్) భారతదేశం తన మొత్తం కేటాయించిన వాటాను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

సింధు జలాలను “మూడు సంవత్సరాలలోపు” కాల్వల ద్వారా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు తీసుకెళ్తామని హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. పాకిస్తాన్ ప్రతి నీటి చుక్క కోసం ఆరాటపడుతుండగా, మిగులు జ‌లాలు మ‌న దేశంలో నీటిపారుదల సౌకర్యాలను పెంపొందిస్తాయ‌ని చెప్పారు.

Must Read
Related News