అక్షరటుడే, వెబ్‌డెస్క్ : U 19 Asia Cup | అండర్ –19 ఆసియా కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. సెమీస్‌లో అద్భుత విజయం సాధించి కుర్రాళ్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. కప్ కోసం టీమిండియా (Team India) చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది.
దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో (Asia Cup) శుక్రవారం రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. భారత్, శ్రీలంక (IND-SL) మధ్య జరిగిన మ్యాచ్‌ను వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహన్ చెరో రెండు వికెట్లు తీశారు.
U 19 Asia Cup | ఓపెనర్లు అవుట్ అయినా..
భారత యువ జట్టు 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఓపెనర్లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఆయుష్ మాత్రే 7, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ 9 పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారత్ 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విహాన్ మల్హోత్రా (Vihan Malhotra)(61*), ఆరోన్ జార్జి (58*) సత్తా చాటారు. మరో వికెట్ పడకుండా వీరు మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో భారత్ 18 ఓవర్లలో లక్ష్యం ఛేదించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలిచి ఫైనల్‌కు చేరింది. దీంతో కప్ కోసం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ మరోసారి తలపడుతున్నాయి. గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.
U 19 Asia Cup | అదరగొడుతున్న కుర్రాళ్లు
అండర్ –19 భారత జట్టు ఈ సారి దూకుడుగా ఆడుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతున్న మ్యాచ్‌లో 14 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. అతడికి తోడు ఆయుష్ మాత్రే, విహన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ అభిషేక్ సైతం చెలరేగుతున్నారు. దీంతో భారత్ అన్ని మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకు వెళ్లింది. ఫైనల్లో కూడా సత్తా చాటి కప్ తీసుకురావాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.