అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND – PAK | భారత్–పాకిస్తాన్ మధ్య వేదిక ఏదైనా, మ్యాచ్ ఎప్పుడైనా… హ్యాండ్ షేక్ వివాదం మాత్రం ఆగేలా కనిపించడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో, భారత జట్టు పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌కు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్‌లో దుబాయ్ (Dubai)లో జరిగిన ఆసియా కప్‌లో ప్రారంభమైన ఈ వివాదం తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 లోనూ కొనసాగింది.ఖతర్‌లోని దోహా వేదికగా ఆదివారం జరిగిన భారత్ ‘ఏ’ – పాకిస్తాన్ ‘ఏ’ మ్యాచ్‌లో టాస్ సమయంలోనే ఇరు జట్ల కెప్టెన్లు జితేశ్ శర్మ (Jitesh Sharma), ఇర్ఫాన్ ఖాన్ (Irfan Khan) పరస్పరం హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేదు.
IND – PAK | పాకిస్తాన్ ఘన విజయం
మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హ్యాండ్ షేక్ (Shake Hand) ఇవ్వకుండా నేరుగా తమ డగౌట్లకు వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో చర్చనీయాంశమైంది. ఆసియా కప్‌తో మొదలైన ఈ వివాదం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. అయితే మ్యాచ్ విషయానికొస్తే, ఆరంభ మ్యాచ్‌లో యూఏఈపై UAE రికార్డు స్కోర్ చేసిన భారత్ ‘ఏ’ జట్టు, పాకిస్తాన్ ‘ఏ’ బౌలర్ల ముందు పూర్తిగా తేలిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా విఫలమవడంతో భారత్ (India) భారీ స్కోరు చేయలేకపోయింది.
వైభవ్ సూర్యవంశీ (45) మాత్రమే ధాటిగా ఆడి జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. నమన్ ధీర్ (35), హర్ష్ దుబే (19) మోస్తరు పరుగులు చేయగా, కెప్టెన్ జితేశ్ శర్మ, ప్రియాన్షు ఆర్య, నేహాల్ వధేరా, అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్ వంటి హిట్టర్లు పూర్తిగా నిరాశపరిచారు.దాంతో భారత్ ‘ఏ’ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ‘ఏ’ జట్టు ఆరంభం నుంచే దూకుడు చూపింది. ఓపెనర్ మాజ్ సాదాఖత్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.47 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 79 నాటౌట్ చేసిన మాజ్ జట్టును విజయతీరాలకి చేర్చాడు. పాక్ జట్టు 13.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 137/2 చేసి మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరుకోగా, భారత్ ఒమన్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
