అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND – PAK | క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు మైదానంలోకి దిగితే చాలు… యావత్ క్రికెట్ ప్రపంచం ఆ మ్యాచ్‌పైనే దృష్టి పెడుతుంది. భారత్–పాక్ మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది భావోద్వేగాల సంగ్రామం. ఇరు దేశాల్లో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు, సోషల్ మీడియా (Social Media)లో మాటల యుద్ధం నడుస్తుంది, మైదానంలో అయితే నిజమైన పోరాట వాతావరణం కనిపిస్తుంది.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ మ్యాచ్‌కు మరింత హీట్ తెచ్చాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వంటి ఘటనల తర్వాత భారత్–పాక్ మ్యాచ్‌లు మరింత సెన్సిటివ్‌గా మారాయి. అయినప్పటికీ, ద్వైపాక్షిక సిరీస్‌లు లేని పరిస్థితుల్లోనూ ఐసీసీ టోర్నీ (ICC Tournament)ల్లో ఈ దాయాదుల సమరం అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది.
IND – PAK | ఈ ఏడాది సమరమే..
గత ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు పలు అంతర్జాతీయ టోర్నీ (International Tournament)ల్లో తలపడ్డాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒకసారి, ఆసియా కప్‌లో మూడు సార్లు, మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఒకసారి, అండర్ 19 ఆసియా కప్‌లో రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ విజయాలతో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు 2026లో కూడా భారత్–పాక్ మ్యాచ్‌లు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పురుషుల, మహిళల, అండర్ 19 స్థాయిలో కీలక టోర్నీలు జరగనున్నాయి. మొదటగా పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 15న శ్రీలంక (Srilanka)లోని కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా తటస్థ వేదికగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. లీగ్ మ్యాచ్‌తో పాటు, ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరితే మరోసారి ముఖాముఖి పోరు జరిగే అవకాశం ఉంది.
అదే విధంగా అండర్ 19 పురుషుల ప్రపంచకప్ కూడా ఆసక్తికరంగా మారనుంది. జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్ గ్రూప్-బీలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, యూఎస్‌ఏతో ఉండగా… పాకిస్థాన్ గ్రూప్-సీలో ఇంగ్లండ్, స్కాట్లాండ్, జింబాబ్వేతో ఉంది. దీంతో లీగ్ దశలో వీరి మధ్య మ్యాచ్ ఉండదు. అయితే ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో దాయాదుల పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఇక మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో మాత్రం భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్–పాక్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌తో పాటు, నాకౌట్ దశల్లోనూ మరోసారి తలపడే అవకాశం ఉంది.