అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pax Silica Alliance | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence), సెమీ కండక్టర్ల సరఫరాను పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్ సిలికా’లో భారత్ చేరింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమిట్ వేదికగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ కూటమిలో చేరుతూ భారత్ సంతకం చేసింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav), అమెరికా రాయబారి సెర్గియో గోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pax Silica Alliance |భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశాలు
2025 డిసెంబర్లో ఈ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. మిత్రదేశాల మధ్య చిప్స్, ఏఐ సరఫరా వ్యవస్థను సురక్షితం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. భారత్ ఇందులో భాగస్వామి కావడంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో కూటమి సభ్యదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాల లభ్యత, ఏఐ పరిశోధనల్లో భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. భారత్ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ (Global Manufacturing Hub)గా ఎదిగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందంతో తొలగిపోయే అవకాశాలున్నాయి.
భారత్ చేరడం కీలక పరిణామం..
‘ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. మన దగ్గర నిపుణుల కొరత లేదు. ఇప్పుడు ప్యాక్స్ సిలికాలో చేరడం వ్యూహాత్మక ముందడుగు. సెమీకండక్టర్ల సరఫరా గొలుసు, చిప్ తయారీ వంటి రంగాలకు ఇది చాలా కీలకం. ఈ కూటమిలో చేరడంతో భారత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమకు లబ్ధి చేకూరనుంది’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. “రెండు దేశాల మధ్య విస్తృత అవకాశాలకు కొదవలేదు. పాక్స్ సిలికాలో భారత్ చేరడం కీలక పరిణామం” అని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (US Ambassador Sergio Gore) అన్నారు.
చైనాకు చెక్ పెట్టేందుకు..
కృత్రిమ మేధ పురోగతికి అవసరమైన సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు అమెరికా గతేడాది ‘ప్యాక్స్ సిలికా’ను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఏఐ, సాంకేతిక వ్యవస్థల అభివృద్ధి కోసం విశ్వసనీయ దేశాలన్నీ కలిసి ఓ భాగస్వామ్య ప్రణాళికను రూపొందించడమే ఈ కూటమి లక్ష్యం. అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రథమ ప్రాధాన్యంగా ఈ కూటమి ఏర్పడింది. ఇందులో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, యూఏఈ, ఇజ్రాయెల్, సింగపూర్ వంటి దేశాలున్నాయి. ఈ కూటమిలో ఇప్పుడు భారత్ చేరింది. దీంతో గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ విషయంలో భారత్ కీలక నిర్ణయాధికారిగా మారే అవకాశాలున్నాయి.