HomeUncategorizedSupreme Court | ఇండియా ధ‌ర్మ‌శాల కాదు.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Supreme Court | ఇండియా ధ‌ర్మ‌శాల కాదు.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Supreme Court | శ‌ర‌ణార్థుల విష‌యంలో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సోమవారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోని అందరికీ ఉచితంగా ఆశ్రయం ఇవ్వడానికి ఈ దేశం ధర్మశాల కాదని సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. శరణార్ధిగా తనకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వాలని శ్రీలంక జాతీయుడు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో పిటిషనర్‌(Petitioner)ను అరెస్టు చేశారు. తనను శరణార్థిగా పరిగణించాలని కోరుతూ అతను వేసిన తాజా పిటిషన్‌పై న్యాయమూర్తులు జ‌స్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె.వినోద్ చంద్రతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Supreme Court | 140 కోట్ల జ‌నాభాతో బాధ‌ప‌డుతున్నాం..

2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద విచారణ కోర్టు శ్రీలంక జాతీయుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాసు హైకోర్టు అతని జైలుశిక్షను ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాలని, దేశం విడిచివెళ్లడానికి ముందు శరణార్ధి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. అయితే, అత‌ను సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు. వీసాతో తాను ఇండియా వచ్చానని, తన ప్రాణాలకు స్వదేశంలో ముప్పు ఉందని కోర్టుకు విన్నవించాడు. తన భార్య, పిల్లలు ఇండియాలో స్థిరపడ్డారని, ఇప్పటికీ తాను మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్నానని, డిపోర్టేషన్(Deportation) ప్రక్రియ మొదలు కాలేదని చెప్పారు. దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ”ప్రపంచంలోని శరణార్ధులందరికీ ఇండియా ఆతిథ్యం ఇవ్వాలా? ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఇబ్బంది ప‌డుతున్నాం. విదేశీయులందరికీ ఇక్కడ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మశాల కాదు” అని వ్యాఖ్యానించారు.

Supreme Court | ఆర్టిక‌ల్ 19 భార‌తీయులకు మాత్ర‌మే..

దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఈ అంశం రాజ్యాంగంలోని 21, ఆర్టికల్ 19 కిందకు వస్తుందన్నారు. దీనిపై జస్టిస్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌ను చట్టప్రకారమే కస్టడీలోకి తీసుకున్నందున అతని నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టు కాదన్నారు. ఆర్టికల్ 19 అనేది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ”ఇక్కడ సెటిల్ కావడానికి మీకున్న హక్కు ఏంటి?” అని కోర్టు ప్రశ్నించింది. అతను శరణార్థి అని, అతని ప్రాణాలకు శ్రీలంక(Sri Lanka)లో ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా, మరో దేశానికి వెళ్లండి అంటూ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Must Read
Related News