అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | భారత్ దూసుకుపోతోంది. అనేక సవాళ్లు, సంక్షోభాల నడుమ జోరు కొనసాగిస్తోంది. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చారిత్రక విజయాలు సాధిస్తోంది. విదేశాంగ విధానంలో సరికొత్త వైఖరితో దూకుడు ప్రదర్శిస్తోంది.
పశ్చిమ దేశాలకు దీటుగా నిలవడమే కాదు, ప్రపంచ పెద్దన్న అమెరికా ఆధిపత్యాన్ని సైతం సవాల్ చేస్తోంది. సుంకాలు, ఆంక్షల బెదిరింపులను తిప్పికొడుతూ ప్రపంచ వేదికపై భారత్ తన శక్తిని ప్రదర్శిస్తోంది. భారత సార్వభౌమత్యానికి సవాల్ విసురుతున్న అమెరికా కుట్రలను, కుయుక్తులను తుత్తునీయలు చేస్తూ అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ కూటమిని తయారు చేస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన దేశాలు రష్యా, చైనాలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా అగ్రరాజ్య ఆధిపత్యానికి గండి కొడుతోంది. అన్ని రంగాల్లో అత్యంత శక్తివంతంగా ఎదిగిన భారత్ ఇప్పుడు భౌగోళిక రాజకీయ, ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపే స్థాయికి చేరింది. 50 శాతం సుంకాలు చాలా ఎక్కువని అంగీకరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నామని తాజాగా పేర్కొనడమే ఇండియా దౌత్య నీతికి దక్కిన మరో విజయం.
Donald Trump | అత్యంత శక్తివంతంగా..
ఇండియా గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత శక్తివంతంగా ఎదిగింది. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) మాత్రమే ఉందని ప్రపంచ దేశాలన్నీ అభిప్రాయం వ్యక్తం చేశాయంటేనే భారత్ ఏ విధంగా శాసించే స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో స్వయం ప్రతిపత్తి సాధించడం మనల్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది.
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’,(Make In India) ‘డిజిటల్ ఇండియా’ వంటి కార్యక్రమాలు అంతర్గత అభివృద్ధికి ఊతమిచ్చాయి. రక్షణ రంగంలో ఒకనాడు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నుంచి నేడు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి సొంత ఉత్పత్తులు, యుద్ధ ట్యాంకులు, జెట్లు భారత్ తయారీ చేయడమే కాదు, అధునాతన క్షిపణులు, రక్షణ వ్యవస్థలను ఎగుమతి చేస్తోంది.
Donald Trump | ఆర్థిక వృద్ధిలో భారత్ జోరు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే మన ఆర్థిక వ్యవస్థ మాత్రం దూసుకుపోతోంది. అంచనాలను మించి మన వృద్ధి రేటు వేగంగా పెరుగుతోంది. గత ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. మరోవైపు, 3.36 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చని రిజర్వ్‌బ్యాంక్ (Reserve Bank) అంచనా వేయడం విశేషం.. మోదీ ప్రభుత్వ సంస్కరణలు.. అనుసరిస్తున్న విధానాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు సైతం పెరిగాయి. సుస్థిర ఆర్థికాభివృద్ధి, అసమానతల తగ్గింపు, పేదరిక నిర్మూలన కొరకు ఆర్థిక సమ్మిళితంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా అనేక విజయాలు సాధిస్తోంది. మన మార్కెట్లు బలమైన పనితీరు కనబరుస్తుండడం ఆర్థిక వృద్ధి రేటును ప్రతిబింబిస్తోంది. మూలధన సృష్టిలో ప్రాథమిక మార్కెట్లు 2023 ఆర్థిక ఏడాదిలో రూ.9.3 లక్షల కోట్లు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.10.9 లక్షల కోట్లు సృష్టించడం విశేషం.
Donald Trump | ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితి..
ఆర్థిక, సైనిక, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు.. అన్నింటా దూసుకుపోతున్న భారత్‌పై సహజంగానే అమెరికా సహా పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వృద్ధి పురోగమిస్తుండడాన్ని జీర్ణించుకోలేక అక్కసు వెల్లగక్కుతున్నాయి. మరోవైపు, ప్రపంచ దేశాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ఆయుధంగా మార్చుకున్నారు. వివిధ దేశాలపై టారిఫ్ విధించి తన దారికి తెచ్చుకుంటున్నారు.
అయితే, భారత్ మాత్రం ట్రంప్‌కు సవాల్ విసురుతోంది. సుంకాలపై అనేక దేశాల అధిపతులు తనతో రాయబారం నడుపుతుంటే, ఇండియా మాత్రం లైట్‌గా తీసుకుంది. పైగా ట్రంప్ తానే స్వయంగా నాలుగుసార్లు ఫోన్ చేసినా ప్రధాని మోదీ కనీసం లిఫ్ట్ కూడా చేయలేదు. తద్వారా అమెరికా (America) ఒత్తిళ్లను తాము పట్టించుకోమనే సందేశాన్ని ఇచ్చారు. సుంకాల బాధిత దేశంగా మారిన ఇండియాకు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. టారిఫ్ యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొంటున్న భారత్‌కు అగ్రరాజ్యంలోనే పుష్కలంగా మద్దతు లభిస్తుండడం ట్రంప్‌కు చికాకు పుట్టిస్తోంది. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగినా.. దిగిరాని భారత్‌ను (India) చూసి ఆయనలో కోపం కట్టలు తెంచుకుంటోంది. భారత దౌత్య వ్యూహాలతో చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Donald Trump | ఎదురుతిరుగడమే అసలైన వ్యూహం
ఒకప్పుడు మనపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెట్టిన దేశాలు భారత్‌పై ఏదో విధంగా పైచేయి సాధించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒత్తిళ్లు, ఆంక్షలు, బెదిరింపులకు వెరువకుండా ఎదురుతిరగడం, దెబ్బ తీయడమే భారత విధానంగా మారింది. పాకిస్తాన్, మాల్దీవులు, మలేషియా, కెనడా, అమెరికా సహా.. అది ఏ దేశమైనా సరే భారత్ మాత్రం వెనుకడుగు వేయకుండా దౌత్య వ్యూహాలతో ఆయా దేశాలకు చెక్ పెడుతోంది. పాకిస్తాన్, చైనా అండతో ఎదిరి తిరిగిన మాల్దీవులకు మోదీ కొట్టిన దెబ్బ గట్టిగానే తగిలింది. పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్న ఆ దేశానికి భారత పర్యాటకులే ఊపిరి పోస్తున్నారు. దీన్నే ఆయుధంగా మార్చిన మోదీ.. లక్ష్యద్వీప్‌లో పర్యటించి.. అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బాయ్‌కాట్ మాల్దీవులు అన్న ప్రచారం ఊపందుకుంది. టూరిస్టులు తగ్గిపోయి, ఆదాయం పడిపోయిన తరుణంలో మాల్దీవులు మన దారికి వచ్చింది. ఇలాంటి ఉదంతాలెన్నో ఉన్నాయి.
సైనికంగా ఎంతో బలమైన చైనాకు కూడా దీటుగా నిలిచింది. గల్వాన్ లోయలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంది. అంతకు ముందు డోక్లాంలో ఎన్ని బెదిరింపులకు పాల్పడినా చలించకపోవడతో చైనానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతెందుకు ఉగ్రవాదులతో తరచూ దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్‌కు భారత్ గట్టి పాఠమే చెప్పింది. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌తో దాయాది కాళ్లబేరానికి రాక తప్పలేదు.