అక్షరటుడే, వెబ్డెస్క్ : Cess on Tobacco Products | దేశంలో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఆధారిత ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పార్లమెంట్‌లో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సిద్ధమవుతున్నారు.
ఢిల్లీ (Delhi)లో జరుగనున్న సమావేశంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఉండనుంది. కొత్తగా రెండు బిల్లులు ప్రవేశపెట్టనుండగా, ఇందులో హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025, సెంట్రల్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు ఉండనున్నాయి. ఈ రెండు బిల్లుల ప్రధాన ఉద్దేశ్యం — ప్రస్తుతం అమలులో ఉన్న GST కంపెన్సేషన్ సెస్సును తొలగించి, అదే నిర్మాణం కొనసాగిస్తూ కొత్త పేరుతో పన్ను వసూళ్లను కొనసాగించడం. CNBC ఆవాజ్ ఆర్థిక ఎడిటర్ లక్ష్మణ్ రాయ్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు, అంటే ధరలు తక్షణమే పెరగవు.
Cess on Tobacco Products | ఎందుకు కొత్త సెస్సు?
ప్రస్తుతం సిగరెట్లు (Cigarettes), గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై GSTతో పాటు కంపెన్సేషన్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఈ సెస్సు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయ లోటు తలెత్తకుండా అదే నిర్మాణాన్ని కొత్త చట్టం కింద కొనసాగించబోతోంది.ఈ మార్పుతో పన్నుల వ్యవస్థ మరింత పారదర్శకత పొందుతుంది. పన్ను వసూళ్లు సులభతరం అవుతాయి. సంస్థాగత నియంత్రణ పెరుగుతుంది. ఈ మార్పు వల్ల సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ధరల్లో ఎలాంటి మార్పు రాదు. అందుకు కారణం పన్ను రేట్లు మారకపోవడం.
రిపోర్టింగ్ విధానాలు, అకౌంటింగ్ ప్రక్రియలు, పన్ను అనుసరణ విధానాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా సిగరెట్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయి. కొత్త చట్టంతో మరింత పర్యవేక్షణ, ట్రాకింగ్ తప్పనిసరి కావచ్చు. పొగాకు ఉత్పత్తులను మళ్లీ GST పరిధి నుండి బయటకు తీసి ఎక్సైజ్ చట్టం కిందికి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇది చేయడంలో ప్రయోజనాలు ఏంటనేది చూస్తే.. పన్నులను ఉత్పత్తి స్థాయిలో ట్రాక్ చేయడం సులభం, పన్ను ఎగవేత తగ్గుతుంది, అక్రమ రవాణాను నియంత్రించవచ్చు, పన్ను సేకరణ మరింత క్రమబద్ధం అవుతుంది. ఈ చర్యలను ప్రభుత్వం ఆర్థిక లక్ష్యంగానే కాకుండా ఆరోగ్య రక్షణ చర్యగా కూడా చూస్తోంది. పాన్ మసాలా (Pan Masala), గుట్కా, సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమైనవి. వీటి వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు అధిక పన్నులు విధించడం ప్రభుత్వ విధానం. అందుకే కొత్త సెస్సుకి ‘హెల్త్ సెక్యూరిటీ’ అనే పేరు ఇవ్వబడింది. ఇప్పటి వరకు పన్ను రేట్లు మారకపోయినా, ఉత్పత్తులు ఎక్సైజ్ పరిధిలోకి రావడంతో భవిష్యత్‌లో పన్ను రేట్లు పెంచడం ప్రభుత్వం కోసం చాలా సులభం అవుతుంది.
