అక్షరటుడేర, వెబ్‌డెస్క్ : WCL 2025 | వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో టీమిండియా నిరాశ పరంపర కొనసాగిస్తూ ఉంది. ఆదివారం (జూలై 27) లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్.. ఇంగ్లాండ్ ఛాంపియన్స్ (England Champions) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. మాజీ ఆల్‌రౌండర్ రవి బొపారా విజృంభించాడు. కేవలం 55 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ఇయాన్ బెల్ 54 పరుగులతో మద్దతుగా నిలిచాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది.
WCL 2025 | ఫైట్ ముగిసినట్టే..
భారత బౌలర్లలో హర్భజన్ సింగ్(Harbhajan Singh) రెండు, వరుణ్ అరోన్ ఒక వికెట్ తీశారు. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే ఓపెనర్ రాబిన్ ఉతప్ప డకౌట్ కావడంతో భారీ షాక్ తగిలింది. తర్వాత యూసఫ్ పఠాన్ (29 బంతుల్లో 52), యువరాజ్ సింగ్ (38), స్టువర్ట్ బిన్ని (35) రాణించినా విజయం మాత్రం చేజారింది. చివరకు భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్(Ajmal Shahzad) చెలరేగి నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టువర్ట్ మీకర్ రెండు వికెట్లు, రవి బొపారా ఒక వికెట్ తీశారు.
ఈ ఓటమితో భారత జట్టు(Team India) సెమీఫైనల్ అవకాశాలు మూసుకున్నట్టే. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన అన్ని మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. టోర్నీలో భారత్‌కు ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఇప్పటికే సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా టీంలు సెమీస్‌లోకి ప్రవేశించగా, మిగిలిన ఒక బెర్తు కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్ (West Indies) జట్లు పోటీపడుతున్నాయి. ఆరంభంలో బలంగా కనిపించిన భారత జట్టు వరుస పరాజయాలతో టోర్నీలో నుంచి దాదాపు వెనుదిరిగినట్టయింది. ఇక చివరి లీగ్ మ్యాచ్(League Match)ను గౌరవప్రదంగా ముగించడం కోసమే టీమిండియా బరిలోకి దిగనుంది. ఒకప్పుడు భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించిన సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఇలాంటి ఆట ఆడడం ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరుస్తోంది.