IND vs ENG
IND vs ENG | గెలుపు ముంగిట భార‌త్, ఇంగ్లండ్‌...ఎవ‌రు గెలుస్తారా అని టెన్ష‌న్ టెన్ష‌న్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో తిరిగి పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్​లో తడబడిన భారత్ బౌలింగ్‌తో అద‌ర‌గొట్టింది. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (4/86) , ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) (4/62) లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.

ఇంగ్లండ్ జట్టు 51.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. జాక్ క్రాలీ (57 బంతుల్లో 64; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (64 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్) బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా, మిగతా బ్యాటర్ల నిరాశజ‌న‌క ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. భారత బౌలర్లలో ఆకాశ్​ దీప్ ఒక వికెట్ తీశాడు.

IND vs ENG | బౌల‌ర్ల ఆధిప‌త్యం..

204/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ 69.4 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ నాయర్ (109 బంతుల్లో 57; 8 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26) ఒక్కసారిగా పెవిలియన్‌ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ (5/33) ఐదు వికెట్లు తీయగా, జోష్ టంగ్ (3/57), క్రిస్ వోక్స్ (1) వికెట్లతో సహకరించారు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్(England) బ్యాటింగ్‌కి దిగ‌గా, ఓపెనర్లు డకెట్, క్రాలీ బజ్‌బాల్ శైలిలో దూకుడుగా ఆడారు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. కానీ డకెట్‌ను ఆకాశ్​ దీప్ అవుట్ చేయగా, ఆ తర్వాత భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సిరాజ్ వరుసగా ఓలీ పోప్, జో రూట్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడు. ప్రసిధ్ కృష్ణ తన స్పెల్‌లో జాక్ క్రాలీ, జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్, అట్కిన్సన్‌లను వెనక్కి పంపాడు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఆ తర్వాత చివరి ముగ్గురు బ్యాటర్లు కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఆఖరి సెషన్‌లో బ్రూక్ స్ట్రైక్(Brooke Strike) ఎక్కువగా తీసుకుంటూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. అట్కిన్సన్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. వర్షం ఆటకు అంతరాయం కలిగించిన తర్వాత తిరిగి వచ్చాక బ్రూక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో బ్రూక్ క్లీన్ బౌల్డ్ కావ‌డంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ భార‌త్ మొద‌లు పెట్ట‌గా ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్(India) 2 వికెట్లు కోల్పోయి 75 ప‌రుగులు చేసింది. జైస్వాల్ (51), ఆకాశ్ దీప్ (4) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (7), సాయి సుద‌ర్శ‌న్ (11) ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ప్ర‌స్తుతం భార‌త్ 52 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.