HomeUncategorizedOperation Sindoor | ‘ఆపరేషన్​ సింధూర్’..​ పాక్​లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

Operation Sindoor | ‘ఆపరేషన్​ సింధూర్’..​ పాక్​లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | పహల్​గామ్​లో ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) పేరుతో పాక్​(Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) విరుచుకుపడింది. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు మెరుపు దాడులు చేశాయి. పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను మిస్సైళ్లతో ధ్వంసం చేశాయి. ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పాక్‌ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేయలేదని భారత ప్రభుత్వం పేర్కొంది.

దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. ఇండియన్‌ ఆర్మీ ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. కాగా.. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఆపరేషన్‌ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అనంతరం ‘భారత్‌ మాతా కీ జై’ పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Operation Sindoor | స్పందించిన పాక్‌ ప్రధాని

భారత్‌ దాడులను పాక్‌ సైన్యం ధ్రువీకరించింది. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో ఈ దాడులు చేసినట్లు తెలిపింది. దాడుల్లో ముగ్గురు మరణించారని, మరికొందరు గాయపడ్డారని పాక్‌ ఆర్మీ చెప్పింది. భారత్​ దాడిపై బదులుగా స్పందిస్తామని తెలిపింది. ఇండియన్‌ ఆర్మీ దాడులపై పాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ‘‘మోసపూరిత శత్రువు పాక్​లోని 5 చోట్ల దాడులు చేసింది. ఇందుకు పాకిస్థాన్‌ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. పాక్‌ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్‌కు తెలుసు’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Operation Sindoor | పాక్‌ సైన్యం కాల్పులు

భారత్​ దాడుల అనంతరం సరిహద్దులోని పూంఛ్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. దీంతో భారత్‌ సైతం కాల్పులు ప్రారంభించింది. కాల్పులతో ఎల్‌వోసీ వెంట ఉద్రిక్త వాతావారణం నెలకొంది.