అక్షరటుడే, వెబ్డెస్క్: IND-PAK | భారత్, పాకిస్తాన్ లు తమ అణు స్థావరాల జాబితాను మార్పిడి చేసుకున్నాయి. ఇరు దేశాల అణు స్థావరాలు, సౌకర్యాలపై దాడి నిషేధం ఒప్పందంలో భాగంగా మార్పిడి చేసుకున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) ప్రకటన ప్రకారం.. ఈ మార్పిడి ప్రక్రియ న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ (Islamabad)లలో ఏకకాలంలో దౌత్య మార్గాల ద్వారా జరిగింది.
IND-PAK | మూడు దశాబ్దాలుగా..
ఇరు దేశాల మధ్య మూడు దశాబ్దాల క్రితం అణు భద్రతా ఒప్పందం జరిగింది. 1991లో ఈ ఒప్పందం అమలులోకి రాగా.. ప్రతి సంవత్సరం జనవరి 1న రెండు దేశాలు ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటున్నాయి. మొదటి మార్పిడి 1992లో జరగగా.. ఇది 35వ నిరంతర మార్పిడి అని ఎంఈఏ పేర్కొంది. యుద్ధాలు, ఉగ్రదాడులు, దౌత్య సంక్షోభాలు ఎదురైనప్పటికీ ఈ ఒప్పందం నిరంతరాయంగా కొనసాగుతుండడం విశేషం.
ఈ ఒప్పందం ప్రకారం.. అణు విద్యుత్ కేంద్రాలు (Nuclear Power Plants), పరిశోధనా రియాక్టర్లు (Research Reactors), ఇంధన తయారీ యూనిట్లు, ఐసోటోప్ విభజన ప్లాంట్లు, పునఃప్రాసెసింగ్ యూనిట్లు, రేడియోధార్మిక పదార్థాలు నిల్వ చేసే స్థలాలను వివరాలను మార్చుకుంటారు. ఈ స్థావరాల భౌగోళిక స్థానాలను (అక్షాంశ, రేఖాంశాలు) స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చూస్తారని తెలుస్తోంది.