అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shreyas Iyer | టీమిండియా నూతన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన తొలి సిరీస్‌నే విజయవంతంగా నడిపించాడు. భారత్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో (ODI series) టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది.
ఆదివారం కాన్పూర్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు ఆకట్టుకునే ఆటతీరుతో గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ జట్టు (Australia A team) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 317 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ కూపర్ కాన్లీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) కలిసి జట్టును గట్టెక్కించారు. కానీ చివర్లో వరుసగా వికెట్లు పడటంతో ఆసీస్ 49.1 ఓవర్లలో ఆలౌటైంది.
Shreyas Iyer | అదరగొట్టారు..
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) (3/38), హర్షిత్ రాణి (3/61) మెరిశారు. అలాగే ఆయుష్ బదోనీ (2 వికెట్లు), గుర్‌జపనీత్ సింగ్, నిషాంత్ సింగ్‌లు చెరో వికెట్ తీశారు. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టుకు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శుభారంభం అందించాడు. కేవలం 68 బంతుల్లో 102 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 62 పరుగులు చేస్తూ తన ఆటతీరుతో మెప్పించగా, రియాన్ పరాగ్ కూడా 62 పరుగులతో నిలకడ్డాడు. చివర్లో విప్‌రాజ్ నిగమ్ సమయోచితంగా ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రియాన్ పరాగ్ (Riyan parag) నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకోగా, మూడో వన్డేలో శతకం చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ సిరీస్ తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, 2వ వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించగా, 3వ వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఏ ఒక మంచి ప్రదర్శన ఇచ్చింది. రానున్న సీనియర్ టీమ్ కెప్టెన్సీకి శ్రేయస్ సిద్ధమవుతున్నాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.