అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20 Series)లో కీలకమైన నాలుగో మ్యాచ్ చివరకు రద్దయ్యింది. లక్నోలోని ఇటానా స్టేడియం (Itana Stadium) వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు దట్టమైన పొగమంచు అడ్డంకిగా మారింది. మైదానం మొత్తం పొగమంచుతో కమ్ముకుపోవడంతో ఆట ప్రారంభం కావడం అసాధ్యమైంది. పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశతో మ్యాచ్ అధికారులు చాలా సేపు వేచిచూశారు. అయినప్పటికీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
IND vs SA | పొగమంచుతో బ్రేక్..
వాస్తవానికి ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ నిర్వహించాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవ్వాలి. కానీ లక్నో (Lucknow)లో తీవ్రంగా కురిసిన పొగమంచు కారణంగా టాస్ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. మ్యాచ్ రిఫరీలు, అంపైర్లు దాదాపు ఆరు సార్లు టాస్‌ను వాయిదా వేస్తూ, మైదానాన్ని పలు దఫాలుగా తనిఖీ చేశారు. వెలుతురు సరిపోకపోవడం, విజిబిలిటీ తక్కువగా ఉండటంతో క్రీడాకారులు సురక్షితంగా ఆడే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చారు. దీంతో అభిమానుల నిరాశ మధ్య మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా (Team India)కు సిరీస్‌లో అజేయ ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో మ్యాచ్ ఫలితం లేకపోవడంతో ఇప్పుడు సిరీస్ విజేత ఎవరో నిర్ణయించేది ఐదో, చివరి టీ20 మ్యాచ్ మాత్రమే. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో చివరి మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. సిరీస్ గెలుపు కోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి.మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.