అక్షరటుడే, ఆర్మూర్: SRSP | తెలంగాణ వరప్రదయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) ఎగువ ప్రాంతం వరద పెరుగుతోంది. దీంతో గోదావరిలోకి (Godavari) నీటిని వదులుతున్నారు.
ఎగురు కురుస్తున్న వర్షాలతో సుమారు 54,185 క్యూసెక్కుల వరద సోమవారం ప్రాజెక్టుకు వచ్చింది. దీంతో స్పందించిన అధికారులు 8 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కుల వరద, కాకతీయ ద్వారా 5,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.501టీఎంసీ)లకు గాను.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగులు (80.501టీ ఎంసీలు) ఉంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. పశువుల కాపరులు, రైతులు, ప్రజలు ఎవరూ నది వైపు వెళ్లవద్దని సూచించారు.