అక్షరటుడే ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో (SRSP Inflow) పెరిగింది. ఆదివారం ఉదయం జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సోమవారం ఉదయానికి 34 వేల క్యూసెక్కులకు పెరిగింది.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి గోదావరి (Godavari) నదికి వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 34,734 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1079.60 (43.96 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ప్రాజెక్ట్‌లో రెండు టీఎంసీలు నీరు చేరింది. కాగా గతేడాది ఇదే సమాయానికి 47.25 టీఎంసీల నీరు ఉంది.
Sriram Sagar | ఆయకట్టుకు నీటి విడుదల
శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కింద వానాకాలం (Kharif) సీజన్లో ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 3,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీ సాగర్ (Ali Sagar) ఎత్తిపోతలకు 180 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 191 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు పోతుంది. మొత్తం 8,464 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు అవుతోంది. నవంబర్ 20 వరకు సాగు నీటి విడుదల కొనసాగనుంది. కాకతీయ కాలువ పరిధిలోని జోన్ -1కు ఏడు రోజులు, జోన్-2కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాలువలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు.