అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వానలతో జలాశయంలోకి 68,516 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం 50 వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారం ఉదయానికి 68 వేలకు పెరిగింది.
Sriram sagar | పెరుగుతున్న నీటమట్టం
ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1072.20 (27.174 టీఎంసీలు)అడుగులకు నీరు చేరింది.
సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 54,925 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కులకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ప్రాజెక్ట్‌లోకి మూడు టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.