అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Water Problem | వానాకాలం సీజన్ (Rainy Season) ప్రారంభమై నెలన్నర గడుస్తోంది. అయిన రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy) పడటం లేదు. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అడపాదడపా పడుతున్నాయి. ఈ ఏడాది ఇంకా చెరువుల్లోకి కొత్త నీరు రానే లేదు. వాగులు, వంకలు పారలేదు. దీంతో భూగర్భ జలాలు (Ground Water) పెరగక రైతులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Water Problem | ట్యాంకర్లను ఆశ్రయిస్తున్న నగరవాసులు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో లక్షలాది మంది నివసిస్తారు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో భూగర్భ జలాలు పెరగలేదు. దీంతో చాలా మంది నగరవాసులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. నీరు సరిపోక వాటర్ ట్యాంకర్ల (Water Tankers)ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది జులై 1 నుంచి 14 వరకు 63,724 వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకోగా.. ఈ ఏడాది 86,520కి చేరింది. అంటే 36శాతం బుకింగ్లు పెరిగాయి. ఈ పరిస్థితి నగరంలో నీటి కొరతకు అద్దం పడుతోంది.
Water Problem | నీటిని ఒడిసి పట్టే మార్గాలేవి
హైదరాబాద్ మహా నగరంలో వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి. రోడ్లు జలమయం అవుతాయి. కానీ వర్షం నీటిని ఒడిసి పట్టే చర్యలు మాత్రం కరువయ్యాయి. నగరంలోని చెరువులు ఆక్రమణలతో కనుమరుగు అవుతున్నాయి. దీంతో నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక వృథాగా పోతుంది. భూగర్భ జలాల వృద్ధి కోసం ఇంకుడు గుంతలు (Pits) నిర్మించుకోవాలని చెబుతున్నా.. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో నీటి కష్టాలు తప్పడం లేదు.
Water Problem | 16 వేల ఇళ్లకు నోటీసులు
మహా నగరంలో పడ్డ ప్రతి వర్షం బొట్టును ఒడిసి పడితే నీటి తిప్పలు ఉండవు. ఈ క్రమంలో అధికారులు ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని చెబుతున్నారు. నగరంలో 300 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలనే నిబంధన ఉంది. అయినా చాలా ఇళ్ల యజమానులు ఇంకుడు గుంతలు నిర్మించడం లేదు. ఈ క్రమంలో ఇటీవల సర్వే చేసిన అధికారులు 16 వేల ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.