Homeబిజినెస్​Crude Oil | పెరిగిన ముడి చమురు ధరలు.. పడిపోయిన ఆయిల్‌ కంపెనీల షేర్లు

Crude Oil | పెరిగిన ముడి చమురు ధరలు.. పడిపోయిన ఆయిల్‌ కంపెనీల షేర్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil | మధ్యప్రాచ్యం(Middle east)లో పెరుగుతున్న ఉద్రిక్తతతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌(Israel) దాడి చేయడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర భారీగా పెరిగింది. ఇంట్రాడేలో ఒక దశలో 14 శాతం పెరగడం గమనార్హం.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌(Tehran)పై ఇజ్రాయెల్‌ గురువారం అర్ధరాత్రి తర్వాత ఎయిర్‌ స్ట్రైక్స్‌కు దిగింది. న్యూక్లియర్‌ ప్లాంట్‌, సైనిక స్థావరాలు లక్ష్యాలుగా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌(Iran)కు చెందిన పలువురు మిలిటరీ అధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడులు ఇంతటితో ఆగవని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించారు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సైతం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ దాడులతో హర్మోజ్‌ జలసంధి(Strait of Hormuz) ద్వారా జరిగే గ్లోబల్‌ ఆయిల్‌(Oil) సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జలసంధి ఒమన్‌-ఇరాన్‌ సముద్రమార్గంలో ఉంటుంది.

దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇరుకైన ప్రదేశం ఉండగా.. అందులో 2 కిలోమీటర్ల దూరం నౌకల రాకపోకల కోసం నావిగేషన్‌ చానల్‌ ఉంటుంది. సౌదీ, కువైట్‌, ఖతార్‌, యూఏఈ(UAE), ఇరాక్‌, ఇరాన్‌ల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతమని అంచనా. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ వినియోగంలోనూ 20 శాతం ఇక్కడినుంచే సరఫరా అవుతుంటుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో హర్మోజ్‌ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్‌ ఆయిల్‌(Global Oil) సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్న అంచనాలతో చమురు ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం ఇంట్రాడేలో 14 శాతం పెరగడం గమనార్హం. క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర గత ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యారెల్‌కు 68.04 డాలర్ల వద్ద ఉండగా.. శుక్రవారం 69.52 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77.52 డాలర్లకు చేరింది. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 5 శాతం లాభంతో 71.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Crude Oil | ఆయిల్‌ షేర్లపై ఒత్తిడి..

ముడి చమురు ధర పెరగడంతో చమురు రంగ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ షేర్లు ఇంట్రాడే(Intra Day)లో గరిష్టంగా 6 శాతానికిపైగా పడిపోయాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOCL) షేర్లు 3.9 శాతం, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(Hindustan Petroleum Corporation) షేర్లు 5.3 శాతం నష్టపోయాయి. అయితే క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గుముఖం పట్టడంతో ఆయిల్‌ కంపెనీల షేర్లలో ఒత్తిడి తగ్గింది. దీంతో ఆయా కంపెనీల షేర్ల ధర క్రమంగా పెరుగుతోంది. ఐవోసీఎల్‌ లాభాల్లోకి రాగా.. బీపీసీఎల్‌(BPCL), హెచ్‌పీసీఎల్‌ షేర్లూ కోలుకుంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బీపీసీఎల్‌ 2.1 శాతం, హెచ్‌పీసీఎల్‌ 1.6 శాతం నష్టంతో ఉండగా.. ఐవోసీఎల్‌(IOCL) మాత్రం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.